అగ్నిప్రమాదాలపై రైతులు , ప్రజలు జాగ్రత్తగా ఉండాలి..

అగ్నిప్రమాదాలపై రైతులు , ప్రజలు జాగ్రత్తగా ఉండాలి..
- చిట్యాల ఎస్సై పోచంపల్లి సతీష్
చిట్యాల, ఆంధ్రప్రభ : ఎండాకాలంలో ఉష్ణోగ్రత, తీవ్రంగా పెరిగిపోవడంతో, మండల ప్రజలు, రైతులు, అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చిట్యాల ఎస్ఐ పోచంపల్లి సతీష్ కోరారు. శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ మండలంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటుతున్న క్రమంలో చిన్నపాటి నిర్లక్ష్యం ,భారీ ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీస్తుంద న్నారు.
పంట కోతలు, నూర్పిళ్ల కోసం మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు యంత్రాలు వాడే సమయంలో సరైన నియమాలు పాటించాలి. మంటలను ఆర్పే సాధనాలు, ఇసుక, నీరు , తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పొలాల్లో చెత్తను, పంట వ్యర్థాలను కాల్చాల్సి వస్తే, తప్పనిసరిగా ఉదయం పూట మాత్రమే కాల్చాలి. ఆ సమయంలో రైతు స్వయంగా అక్కడే ఉండి, తగినంత నీటిని అందుబాటులో ఉంచుకోవాలి. విద్యుత్ తీగలు వదులుగా ఉన్నా, నిప్పురవ్వలు వస్తున్నా వెంటనే విద్యుత్ శాఖకు , పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ఎస్సై సతీష్ కోరారు.
