ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
- పౌర్ణమి,మే డే,వరుస సెలవుల ప్రభావం.
- 40 వేల మందికి పైగా భక్తుల రాక
- కిక్కిరిసిన అన్ని క్యూలైన్లు..
- ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు..
- విఐపి దర్శనాలపై నియంత్రణ..
- సామాన్య భక్తులకు ప్రాధాన్యం
- వేసవి తీవ్రతలో నీరు, మజ్జిగ, ప్రసాదం విరివిగా పంపిణీ..
- వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శన సదుపాయాలు..
ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి ; వైశాఖ పౌర్ణమి, శుక్రవారం, మే డే పబ్లిక్ హాలిడే, వరుస సెలవులు, వివాహాల సీజన్అన్ని కలిసి రావడంతో ఇంద్రకీలాద్రి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం తెల్లవారు జాము నుంచే దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో అన్ని దర్శనం క్యూ లైన్లు నిండిపోయాయి. పౌర్ణమి సందర్భంగా శ్రీ కనకదుర్గ అమ్మవారు స్వర్ణ కవచంతో భక్తులకు దర్శనమిస్తుండగా, దేవీ ఖడ్గమాలార్చన, శ్రీచక్ర నవావరణార్చన, చండీహోమం, లక్ష కుంకుమార్చన, శాంతి కళ్యాణం వంటి ఆర్జిత సేవల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ ఈవో వి.కె. శీనానాయక్ ఉదయం నుంచే ఆలయ ప్రాంగణంలో పర్యటించి భద్రతా ఏర్పాట్లు, క్యూ లైన్ల పరిస్థితిని సమీక్షించారు. దర్శనం సాఫీగా జరిగేలా అదనపు సిబ్బందిని విధుల్లో నియమించి, క్యూ లైన్ల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టారు.
అంతరాలయానికి తాత్కాలిక బ్రేక్..

కనకదుర్గమ్మ వారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుండడంతో అంతరాలయ విఐపి ప్రోటోకార్ దర్శనాలకు అధికారులు ఆంక్షలు విధించారు. ఉదయం 9.30 గంటల నుంచే రూ 500 ప్రత్యేక దర్శనం టికెట్ల అమ్మకాలు నిలిపివేయగా, అంతరాలయ దర్శనం పూర్తిగా నిలిపివేశారు. పెరిగిన రద్దీ నేపథ్యంలో ప్రోటోకాల్ దర్శనాలను కూడా తాత్కాలికంగా రద్దు చేసి సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చారు.
ప్రత్యేక ఏర్పాట్లు..
ఇంద్రకీలాద్రి కి భక్తుల రాక క్షణక్షణం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు ముందస్తుగానే చేశారు. ప్రధాన ఆలయం వెనుక టికెట్ స్కానింగ్ పాయింట్ వద్ద చంటి బిడ్డల తల్లులు, వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శన లైన్ ఏర్పాటు చేశారు. వేసవి ఎండల నుండి ఉపశమనం కలిగించేందుకు మంచి నీరు, మజ్జిగ, బిస్కెట్ ప్యాకెట్లను విరివిగా పంపిణీ చేశారు. కొండపై, దిగువ ప్రాంతాల్లో చలివేంద్రాలు, చలువ పందిళ్లు ఏర్పాటు చేసి భక్తులకు విశ్రాంతి సదుపాయం కల్పించారు.

మొబైల్ ఫోన్ల వినియోగాన్ని నియంత్రించేందుకు భద్రతా సిబ్బందికి సూచనలు ఇచ్చిన ఈవో, క్లాక్ రూములు, చెప్పుల స్టాండ్లు, మొబైల్ భద్రపరచే కేంద్రాలను తనిఖీ చేసి భక్తులతో నేరుగా మాట్లాడారు. ఉచిత ప్రసాదం పంపిణీ, పూజా మండపం, చండీహోమం ప్రాంతాల్లో సౌకర్యాలను పరిశీలించి మరింత మెరుగుపరచాలని ఆదేశించారు. మధ్యాహ్న నైవేద్యం కారణంగా దర్శనం తాత్కాలికంగా నిలిపివేయడంతో క్యూ లైన్లలో రద్దీ మరింత పెరిగింది. జాతీయ రహదారిపై ట్రాఫిక్ అధికమవడంతో ఘాట్ రోడ్లో వాహనాల రాకపోకలను నిలిపివేసి, దేవస్థానం బస్సులు, బ్యాటరీ వాహనాల ద్వారా భక్తులను కొండపైకి తరలిస్తున్నారు.
ఊహించని స్థాయిలో రద్దీ..

శుక్రవారం ఊహించని స్థాయిలో రద్దీ నెలకొన్నది.తెల్లవారు జాము నుంచే నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నాం.ఆలయం అంతటా పర్యటించడంతో పాటు సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని గమనిస్తూ వాకీటాకీ ద్వారా సిబ్బందికి ఆదేశాలు ఇస్తున్నానం సుమారు 40 వేల మందికి పైగా భక్తులు వచ్చినట్లు అంచనా వేస్తున్నానం. భక్తులకు నీరు, ప్రసాదం, అన్నప్రసాదం సరఫరాలో ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకున్నానం.వేసవి వేడిని దృష్టిలో ఉంచుకొని ప్రథమ చికిత్స కేంద్రాల్లో వైద్య సేవలు అందిస్తున్నానం. రానున్న రోజుల్లో కూడా ఇదే స్థాయిలో జాగ్రత్తలు తీసుకుని,సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించడమే లక్ష్యం.
