పర్యాటక శాఖలో సంక్షోభం

పర్యాటక శాఖలో సంక్షోభం

హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్ర పర్యాటక రంగం అభివృద్ధి బాట పట్టాల్సింది పోయి, అధికారుల కొరత, అదనపు బాధ్యతల భారంతో కుంటుపడుతోంది. పర్యాటక శాఖలో పాలన పూర్తిగా గాడి తప్పుతోంది. కీలకమైన విభాగాలకు పూర్తిస్థాయి అధికారులను నియమించడంలో ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం సంస్థ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది. ఒకే అధికారికి రెండు, మూడు బాధ్యతలు అప్పగించడంతో వారు ఏ విభాగానికీ న్యాయం చేయలేక సతమతమవుతున్నారు.

ఫలితంగా పర్యవేక్షణ లోపించి, కిందిస్థాయి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పర్యాటక శాఖకు ప్రధాన ఆదాయ వనరులైన మార్కెటింగ్, బోటింగ్, హోటల్స్ విభాగాల్లో పూర్తిస్థాయి అధికారులు లేకపోవడంతో కొత్త పథకాలు, ప్రమోషన్లు అటకెక్కాయి. పక్క రాష్ట్రాలు పర్యాటకంతో కోట్లు గడిస్తుంటే, మన రాష్ట్రంలో మాత్రం ఉన్న వనరులను కూడా సద్వినియోగం చేసుకోలేని దయనీయ స్థితి నెలకొంది.

ఎండీ నుంచి ఈడీ వరకూ ఇన్‌చార్జులే…

పర్యాటక శాఖలో అత్యంత కీలకమైన మేనేజింగ్ డైరెక్టర్ పోస్టును ప్రభుత్వం పూర్తిస్థాయిలో భర్తీ చేయలేదు. ప్రస్తుతం ఎండీగా ఉన్న అధికారిణికి ఇప్పటికే మూసీ రివర్ ఫ్రంట్ జేఎండీగా, కుతుబ్ షాహీ టూమ్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు పర్యాటక శాఖ ఎండీగా అదనపు బాధ్యతలు కూడా ఉన్నాయి. అటు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ ప్రక్షాళన, ఇటు ఆదాయ మార్గమైన పర్యాటక అభివృద్ధి—రెండింటి మధ్య సమతుల్యత దెబ్బతింటోందనే విమర్శలు ఉన్నాయి. ఇక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) పరిస్థితి కూడా అంతే. సెట్విన్ ఎండీగా ఉన్న అధికారికి టూరిజం ఈడీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఒక్కరే మూడు శాఖలకు దిక్కు

సంస్థలో పనిభారం ఏ స్థాయిలో ఉందంటే, ఒకే ఒక్క అధికారిణి ఏకంగా మూడు కీలక విభాగాలను పర్యవేక్షించాల్సి వస్తోంది. మార్కెటింగ్ జీఎం, పీఆర్ జీఎం, అకౌంట్స్ జీఎం, వాటర్ ఫ్లీట్ జీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల తనపై పడుతున్న పనిభారంపై ఆమె తన సహచర అధికారుల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఇన్ని బాధ్యతలతో ఆ అధికారిణి మార్కెటింగ్ లాంటి కీలక విభాగంపై దృష్టి పెట్టకపోతే సంస్థకు ఆదాయం ఎలా వస్తుందనే ప్రశ్నలు పర్యాటక నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. సంస్థలో అవినీతిని అరికట్టాల్సిన విజిలెన్స్ జీఎంగా ఉన్న అధికారులకే ట్రాన్స్‌పోర్ట్ జీఎంగా అదనపు బాధ్యతలు అప్పగించడం విడ్డూరం.

అటు హరిత హోటల్స్ జీఎంగా ఉన్న అధికారికి, గతంలో ప్రత్యేక జీఎం ఉన్న బేగంపేట ప్లాజా ఇన్‌చార్జ్ బాధ్యతలను కూడా కలిపేశారు. ఇలా ప్రతి కీలక పోస్టులోనూ ఇన్‌చార్జులే ఉన్నారు. పైస్థాయి అధికారులందరూ అదనపు బాధ్యతలతో మీటింగ్లకే పరిమితమవుతుండటంతో, ఏ ఒక్క శాఖ మీద పూర్తి స్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో క్షేత్రస్థాయిలో కిందిస్థాయి అధికారులు, సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Leave a Reply