ప్రతిరోజూ ఒక వార్డు
ప్రతిరోజూ ఒక వార్డు
- క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి…
ఆంధ్రప్రభ, హైదరాబాద్ : క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి ప్రతిరోజూ ఒక వార్డు కార్యక్రమానికి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి.సృజన, పటాన్‌చెరు మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఈరోజు(గురువారం) వారు తెల్లాపూర్ వార్డును సందర్శించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానికులు, ప్రజాప్రతినిధులతో ప్రతినిధులతో మాట్లాడారు. అయితే కమిషనర్లకు పలు సమస్యలను వారు ఏకరువు పెట్టారు.

దెబ్బతిన్న రోడ్లకు వెంటనే ప్యాచ్ వర్కులు చేపట్టాలని, కొత్త వీధి దీపాలను ఏర్పాటు చేయాలని, పనిచేయని వాటికి మరమ్మతులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు. క్రమ తప్పకుండా పారిశుధ్య పనులు చేపట్టాలని కోరారు. క్రమం తప్పకుండా రోడ్లపై చెత్తను తొలగించాలన్నారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి నీరు నిల్వకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మూసుకుపోయిన డ్రైన్‌లను శుభ్రపరచడం, నీరు పొంగిపొర్లడాన్ని నివారించడానికి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలన్నారు. రోడ్లపై రద్దీని నివారించడానికి పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయాలన్నారు.

ప్రజలు నడిచే మార్గాలపై ఆక్రమణలను తొలగించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. నీటి సరఫరాకు సంబంధించిన సమస్యలను సకాలంలో పరిష్కరించడానికి హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌ఎస్‌బి అధికారులతో సమన్వయం పనిచేయాలన్నారు. భద్రత, పర్యవేక్షణ కోసం కీలక ప్రదేశాలలో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. కాలుష్యం, రోడ్ల నష్టం, ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న ఆర్‌ఎమ్‌సి యజమానులపై కఠిన చర్యలు ప్రారంభించాలన్నారు.

