30 ఏళ్ల ఉపగ్రహ అధ్యయనం ఏమి చెబుతోంది?

30 ఏళ్ల ఉపగ్రహ అధ్యయనం ఏమి చెబుతోంది?

తిరుపతి (రాయలసీమ), ఆంధ్రప్రభ బ్యూరో : రాయలసీమ పరిధిలో తరతరాలుగా కరవు కష్టాలను ఎదుర్కొంటున్న అనంతపురం జిల్లా ఎడారిగా మారిపోయే ప్రమాదం పొంచి ఉందని తాజా శాస్త్రీయ అధ్యయన నివేదిక హెచ్చరిస్తోంది. గత 30 ఏళ్లలో జరిగిన మార్పులపై ఉపగ్రహ సాంకేతికతతో చేసిన అధ్యయనం ప్రకారం, సుమారు 192 చదరపు కిలోమీటర్ల పరిధిలో భూక్షయం ముప్పు పెరుగుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి సంబంధిత ప్రాంతాల్లో సామాజిక నీటి నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ చర్యలు అత్యవసరమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

రాయలసీమ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు, నీటి కొరత, వలసల పెరుగుదల వంటి సమస్యలు కలిసివచ్చి, అనంతపురం జిల్లా చాలా కాలంగా కరవు సీమగా నిలిచింది. కాలక్రమేణా కొన్ని మార్పులు చోటుచేసుకున్నప్పటికీ, సమస్యకు పూర్తి స్థాయి పరిష్కారం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో CSIR, NGRI ఆధ్వర్యంలో జరిగిన ఈ ముఖ్యమైన పరిశోధనలో పర్యావరణ క్షీణత, భూభాగ క్షయం వంటి అంశాలు స్పష్టమయ్యాయి. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా చేసిన ఈ అధ్యయనం గంభీర పరిస్థితులను వెలుగులోకి తెచ్చింది.

నాలుగు అంశాలపై అధ్యయనం

ఈ పరిశోధనలో మొక్కల పెరుగుదల తగ్గిపోవడం, ఉష్ణోగ్రతలు పెరగడం, ఇసుక దిబ్బల విస్తరణ, భూమి క్షారత్వం పెరగడం వంటి కీలక అంశాలను విశ్లేషించారు. 30 ఏళ్ల డేటా ఆధారంగా ఈ మార్పులు వేగంగా పెరుగుతున్నాయని తేలింది. వ్యవసాయ భూములు సారవంతత కోల్పోతూ, ఇసుక మేటలుగా మారుతున్న పరిస్థితి భవిష్యత్తులో ఎడారీకరణ ప్రమాదాన్ని మరింత పెంచుతోంది. హగరి నది వరదల ప్రభావంతో ఏర్పడిన ఇసుక దిబ్బల విస్తరణ ఈ సమస్యకు ప్రధాన కారణమని గుర్తించారు.

బెళుగుప్ప, కణేకల్, బొమ్మనహళ్ల మండలాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ముఖ్యంగా శ్రీరంగాపురం గ్రామంలో 26 హెక్టార్ల భూమి పూర్తిగా నష్టపోయినట్టు వెల్లడైంది. ఉష్ణోగ్రతల పెరుగుదల, భూగర్భ జలాల తగ్గుదల, వృక్ష సంపద క్షీణత వంటి అంశాలు ప్రమాద సంకేతాలుగా నివేదిక పేర్కొంది. భవిష్యత్తులో ఇసుక తుఫానులు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఇసుక తవ్వకాల నియంత్రణ, రైతుల అవగాహన, సామాజిక నీటి నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ చర్యలు వంటి దీర్ఘకాలిక పరిష్కారాలు అత్యవసరమని శాస్త్రవేత్తలు సూచించారు.