ఆదిత్యుని సన్నిధిలో ఉపరాష్ట్రపతి

ఆదిత్యుని సన్నిధిలో ఉపరాష్ట్రపతి

శ్రీకూర్మనాథుని సేవలో తరించిన రాధాకృష్ణన్‌
కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు నివాసంలో ఆత్మీయ విందు
ఆలయాల్లో ప్రత్యేక పూజలు.. ఆశీర్వచనాలు

శ్రీకాకుళం, (ఆంధ్రప్రభ బ్యూరో) భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌ జిల్లా పర్యటన సోమవారం ఆధ్యాత్మిక పరంగా సాగింది. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడంతో పాటు కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రమాన్నయుడు తొ ఉన్న పాత అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ముందుగా డచ్‌బంగ్లా హెలిప్యాడ్‌ వద్ద ఉపరాష్ట్రపతికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, డీఐజీ గోపీనాథ్‌ జెట్టి, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్‌ రెడ్డి ఘనస్వాగతం పలికారు. అక్కడి నుండి మిల్లు జంక్షన్‌ మీదుగా కాన్వాయ్‌లో నేరుగా శ్రీకూర్మ క్షేత్రానికి చేరుకున్నారు. లోకైక ఏకైక కూర్మ రూప క్షేత్రంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అరసవల్లిలో ఆశీర్వచనం:

అనంతరం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ నేతృత్వంలో పూర్ణకుంభంతో స్వాగతం లభించింది. అంతరాలయంలో స్వామివారిని దర్శించుకున్న ఆయనకు వేద మంత్రోచ్ఛారణల మధ్య తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాన్ని అందజేశారు. తరువాత ఆయన ఇంద్ర పుష్కరణిలో జరుగుతున్న నూతన నిర్మాణ పనులను స్వయంగా వెళ్లి దగ్గరుండి పరిశీలించారు. పర్యటనలో భాగంగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు గొండు శంకర్, నడికుదుటి ఈశ్వరరావు, మామిడి గోవిందరావు తదితరులు ఉపరాష్ట్రపతిని గౌరవపూర్వకంగా కలుసుకున్నారు.

మంత్రి నివాసంలో ఆత్మీయ సమావేశం..:

ఆలయాల దర్శనం అనంతరం ఉపరాష్ట్రపతి నేరుగా కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పలువురు ప్రముఖులను ఆయన పలకరించారు. ఈ సందర్భంగా దివంగత కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడుతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎర్రన్నాయుడు సతీమణి విజయలక్ష్మిని, సోదరుడు కింజరాపు ప్రభాకరరావును ఆత్మీయంగా పలకరించారు. అనంతరం మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. సుమారు గంటన్నర పాటు గడిపిన ఆయన, అక్కడి నుండి నేరుగా హెలిప్యాడ్‌కు చేరుకుని హెలికాప్టర్‌లో విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు. ఉపరాష్ట్రపతి పర్యటనను పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పర్యటన అంతా ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది.

Leave a Reply