ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బీఆర్‌ఎస్‌వీ పోరుబాట

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బీఆర్‌ఎస్‌వీ పోరుబాట

  • రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
  • బీఆర్‌ఎస్‌వీ జిల్లా నాయకులు అభిలాష్ రెడ్డి ఆధ్వర్యంలో

నిజామాబాద్ అర్బన్, ఆంధ్రప్రభ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఆశన్న గారి జీవన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే సూచనల మేరకు బీఆర్‌ఎస్‌వీ జిల్లా నాయకులు అభిలాష్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 8 వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు తెలిపారు. “బీఆర్‌ఎస్‌వీ ఫీజు పోరుబాట” పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల కాకపోవడంతో విద్యార్థులు తరగతులకు హాజరుకావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు అసలు ధృవపత్రాలు (ఒరిజినల్ సర్టిఫికెట్లు) ఇవ్వకపోవడంతో ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. సుమారు 13 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని విమర్శించారు.

ఎన్నికల ముందు గ్రీన్ చానల్ ద్వారా బకాయిలు వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయకపోవడం వల్ల విద్యార్థులు మానసిక ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. రీయింబర్స్‌మెంట్ లేకపోవడంతో పై చదువులు, ఉద్యోగ అవకాశాలు కూడా దూరమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో కొన్ని కళాశాల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించగా, ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడం వల్ల 2026-27 విద్యాసంవత్సరం నుంచి ఫీజులను నేరుగా విద్యార్థుల నుంచి వసూలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయాలని కూడా నిర్ణయించినట్లు వెల్లడించారు.

బీఆర్‌ఎస్‌వీ ప్రకటించిన నిరసన కార్యక్రమాల ప్రకారం, అన్ని జిల్లా కలెక్టరేట్లలో ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు సమర్పించగా, నేడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లక్ష పోస్టు కార్డుల ద్వారా ఫిర్యాదు చేయనున్నారు. 29 ఏప్రిల్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు సమర్పించారు. ఈ కార్యక్రమంలో అభిలాష్ రెడ్డి, మధుకర్, ప్రశాంత్, అభిషేక్, నితిన్, సాయి, సంతు న్యాల్కల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply