47 people | డీజీపీ సమక్షంలో ఆయుధాల సమర్పణ
47 people | డీజీపీ సమక్షంలో ఆయుధాల సమర్పణ
47 people |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ పోలీసుల ముందు భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. హైదరాబాద్లోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో 47 మంది మావోయిస్టులు ఆయుధాలు విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిశారు.
ఈ సామూహిక లొంగుబాటులో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారని ఉన్నతాధికారులు వెల్లడించారు. వీరంతా చాలా కాలంగా అడవుల్లో మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు సమాచారం.
ఈ సందర్భంగా మావోయిస్టులు ఏకే-47, ఎస్ఎల్ఆర్లతో పాటు మొత్తం 34 అత్యాధునిక మారణాయుధాలను పోలీసులకు అప్పగించారు. ఇది భద్రతా వ్యవస్థకు పెద్ద విజయంగా అధికారులు పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేయడంతో పాటు గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్లు ముమ్మరం చేయడం వల్లే ఈ లొంగుబాటు సాధ్యమైందని తెలుస్తోంది.
ఈ భారీ లొంగుబాటు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న మావోయిస్టు ఉద్యమానికి గట్టి దెబ్బగా భావిస్తున్నారు. తెలంగాణలో మావోయిస్టుల ఉనికి ఇప్పుడు దాదాపు నామమాత్రంగా మారిపోయిందని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. సాయుధ పోరాటం ద్వారా ప్రయోజనం లేదని గ్రహించినవారే ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
