సీఎంఓ అర్జీలపై కలెక్టర్ ప్రత్యేక నజర్

సీఎంఓ అర్జీలపై కలెక్టర్ ప్రత్యేక నజర్
కర్నూలు బ్యూరో , ఆంధ్ర ప్రభ: జిల్లా ప్రజల సమస్యల పరిష్కారంలో వేగం పెంచేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన అర్జీలను స్వయంగా పరిశీలిస్తూ, అర్జీదారులతో నేరుగా ఫోన్ ద్వారా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు.
ఈ క్రమంలో రెవెన్యూ శాఖకు సంబంధించిన పలు అర్జీలపై కలెక్టర్ స్పందించారు. హోలగుండ మండలానికి చెందిన ఎం. నాగమణి, దేవనకొండ మండలం కె. సరోజ, కోడుమూరు మండలం మైమున్ బీ ఇచ్చిన వినతులను వివరంగా విచారించారు. సంబంధిత అంశాలపై పూర్తి స్థాయి పరిశీలన చేసి నివేదిక సమర్పించాలంటూ ఆయా మండల తహసిల్దార్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
అర్జీల పరిష్కారంలో పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యం ఇస్తున్న కలెక్టర్, ప్రతి వారం అర్జీదారులతో స్వయంగా మాట్లాడి సమస్యల పరిష్కారాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ విధానం వల్ల అర్జీదారులు సంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ సేవలపై నమ్మకం పెరుగుతోందని పేర్కొంటున్నారు. జిల్లా పరిపాలనలో ప్రజల సమస్యలకు ప్రాధాన్యం ఇస్తూ వేగవంతమైన స్పందన చూపిస్తున్న కలెక్టర్ చర్యలు ప్రశంసలు అందుకుంటున్నాయి.
