ఉద్యోగుల సంక్షేమానికి కేంద్రం కొత్త నిర్ణయం

ఉద్యోగుల సంక్షేమానికి కేంద్రం కొత్త నిర్ణయం
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, వారి భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త జీవిత బీమా పథకాన్ని ప్రారంభించింది. సమయానుగుణంగా, నిర్దేశిత సమయానికి ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా డీఏలను పెంచుతున్న కేంద్రం, ఉద్యోగుల సంక్షేమం విషయంలో అనుక్షణం ఆలోచిస్తోందని ఈ పథకం ద్వారా మరోసారి స్పష్టమైంది. కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అన్ని రకాల ఉద్యోగులకు ఆర్థిక భద్రత, బ్యాంకింగ్ సౌకర్యాలను అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ పథకాన్ని అమలు చేసింది.
ఈ పథకం ద్వారా బ్యాంకింగ్ సేవలతో పాటు ఇన్సూరెన్స్ సేవలు, బ్యాంకుల ద్వారా వివిధ రకాల ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, మిలటరీ, పారామిలటరీ సిబ్బందికి అందనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల్లో మరింత మెరుగైన సేవలు అందేలా ఈ పథకం రూపొందించబడింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక సహకారం, ఇతర సమస్యల పరిష్కారానికి ఇది ‘వన్ స్టాప్ సొల్యూషన్’లా పనిచేస్తుంది. అన్ని స్థాయిల్లో, అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ పథకం ద్వారా ప్రయోజనాలు అందనున్నాయి.
పథకం ముఖ్య ప్రయోజనాలు:
- మెరుగైన సేవలతో జీరో బ్యాలెన్స్ శాలరీ అకౌంట్ సౌకర్యం
- ఉచితంగా ఆర్డీ, నీఫ్ట్, యూపీఐ వంటి రిమిటెన్స్ సదుపాయాలు, చెక్‌బుక్ సౌకర్యం
- తక్కువ వడ్డీ రేట్లకు గృహ, విద్య, వాహన, వ్యక్తిగత రుణాల సౌకర్యం
- లాకర్ అద్దె, లోన్ ప్రాసెసింగ్ ఛార్జీలలో మినహాయింపులు
- రూ.1.5 కోట్ల వరకు వ్యక్తిగత ప్రమాద భీమా
- విమాన ప్రమాదాల సందర్భంలో రూ.2 కోట్ల వరకు భీమా కవరేజ్
- ప్రమాదాల వల్ల శాశ్వత లేదా పాక్షిక వైకల్యానికి రూ.1.5 కోట్ల వరకు భీమా
- రూ.20 లక్షల వరకు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, అదనపు టాప్-అప్ సదుపాయం
- వ్యక్తిగతంగా మరియు కుటుంబానికి సమగ్ర ఆరోగ్య బీమా
- డెబిట్, క్రెడిట్ కార్డులపై అదనపు ప్రయోజనాలు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం
ఈ పథకాన్ని రూపొందించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
