సామాజిక బాధ్యత ఎక్కడ..?

సామాజిక బాధ్యత ఎక్కడ..?
రేగొండ, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని పలు జిల్లాలు, పట్టణాలు పరిసర ప్రాంతాల్లో ఇటీవల పరీక్షలు ముగిసిన వెంటనే విద్యార్థులు తమ పుస్తకాలు, నోట్స్‌ను చింపి రోడ్లపై పారేస్తున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పరీక్షలు పూర్తయ్యాయన్న ఆనందంలో కొంతమంది విద్యార్థులు పాఠశాలల ప్రతిష్ఠను కూడా మరిచి, రోడ్లను చెత్తబుట్టలుగా మార్చడం విచారకరం. ఈ పరిస్థితి మనందరినీ ఒక ముఖ్యమైన ప్రశ్న అడగాల్సిన పరిస్థితికి తెస్తోంది.
మనము నేర్చుకున్న విద్య ఇదేనా? పరీక్షలు ముగిసిన వెంటనే పుస్తకాల పై గౌరవం, మన ఇంగిత జ్ఞానం కూడా ముగిసిపోతుందా? విద్యార్థులు చేసిన ఈ నిర్లక్ష్యానికి సామాన్య ప్రజలు ఎందుకు ఇబ్బంది పడాలి? రోడ్లపై పడిన చెత్తను శుభ్రం చేయాల్సింది. ఇలాంటి ఘటనలు కేవలం పర్యావరణానికి హానికరమే కాకుండా, విద్య విలువను తగ్గించే చర్యలుగా భావించాలి. దీనిపై పాఠశాలలు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు తప్పకుండా స్పందించి, విద్యార్థుల్లో బాధ్యతాభావాన్ని పెంపొందించాలి.
ఈ విషయంపై ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తంగళ్ళపల్లి కుమారస్వామి మాట్లాడుతూ… “విద్య అనేది కేవలం పరీక్షలు రాసి మార్కులు సాధించడం మాత్రమే కాదు. మనం చదివే పుస్తకాలను గౌరవించడం, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కూడా విద్యలో భాగమే. పరీక్షలు పూర్తయ్యాయంటే కేవలం ఒక విద్యా సంవత్సరం ముగిసినట్లే కాని, బాధ్యత గల పౌరులుగా మన కర్తవ్యాలు ఎప్పటికీ ముగియవు” అని పేర్కొన్నారు.
అలాగే ఆయన పాఠశాలలు విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలపై ప్రత్యేక అవగాహన కల్పించాలని, తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై మరింత శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థులు వెంటనే తమ బాధ్యతను గుర్తించి, పుస్తకాలను సంరక్షించడం, పరిసరాలను శుభ్రంగా ఉంచడం వంటి మంచి అలవాట్లను అలవరచుకోవాలని, సమాజం మొత్తం కలిసి సానుకూల మార్పు తీసుకురావాలని పిలుపునిచ్చారు.
