కన్నతల్లిపై కూతురు దాడి యత్నం

కన్నతల్లిపై కూతురు దాడి యత్నం
- మానవత్వాన్ని మంటగలిపిన కుటుంబ కలహాలు
కోదాడ, ఆంధ్రప్రభ : కన్నతల్లినే కడతేర్చేందుకు ప్రయత్నించిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని పాత గుడిబండ గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సంబంధాలు, మానవత్వాన్ని మంటగలిపే ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన కుక్కడపు గురవమ్మ అనే వృద్ధ మహిళకు నలుగురు కుమారులు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. కుటుంబంలో ఆస్తి, వ్యక్తిగత సమస్యల కారణంగా తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ముఖ్యంగా చిన్న కూతురు గుడిద లక్ష్మి కుటుంబంలో వివాదాలు మరింత పెరిగాయి.
లక్ష్మి కుమారుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు ఉండటంతో, ఈ విషయంపై తరచూ కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదాల్లో గురవమ్మ తరచూ జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించేది. అయితే, ఇదే విషయం చిన్న కూతురు కుటుంబానికి ఆగ్రహానికి కారణమైంది.ఈ క్రమంలోనే, సోమవారం అర్ధరాత్రి సమయంలో లక్ష్మి మరియు ఆమె కుమారులు కలిసి గురవమ్మపై దాడి చేసి హత్య చేయాలని ప్రయత్నించినట్లు సమాచారం. వృద్ధురాలు తీవ్రంగా గాయపడగా, స్థానికులు గమనించి వెంటనే అడ్డుకున్నారు. అనంతరం ఆమెను చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలు ఎంతటి దారుణానికి దారి తీసాయో ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మానవత్వం మసకబారుతున్న కన్నతల్లినే హత్య చేయాలని ప్రయత్నించడం సమాజంలో విలువలు ఎంతగా దిగజారిపోయాయో సూచిస్తోందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. కుటుంబ బంధాలు చల్లారిపోతే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయం తెలుసుకున్న కోదాడ రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను వివరాలు అడిగి తెలుసుకొని కేసు నమోదు చేశారు.
