ఏ.ఎస్. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను సందర్శ‌న‌…

ఏ.ఎస్. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను సందర్శ‌న‌…

వెస్ట్ బైపాస్‌పై ప్రత్యేక దృష్టి
​బ్లాక్ స్పాట్స్ గుర్తింపు
ట్రాఫిక్ ఏసిపి శ్రీ వేద

పాయకాపురం, ఆంధ్రప్రభ : విజయవాడ నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, రహదారి భద్రతే ధ్యేయంగా పని చేస్తామని విజయవాడ నూతన ట్రాఫిక్ ఏసీపీ శ్రీ వేద స్పష్టం చేశారు. ఏసీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా బుధవారం ఆమె అజిత్ సింగ్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ​ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను తనిఖీ చేసి, సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం కండ్రిక ప్రాంతంలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ గ్రౌండ్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడ వాహనాల నిలిపివేత, ఇతర వసతులపై అధికారులకు పలు సూచనలు చేశారు.

కేవలం సాధారణ తనిఖీలు మాత్రమే కాకుండా, నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి ఒక పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండే వెస్ట్ బైపాస్ వంటి కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు, క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. దీనివల్ల ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాల నుండి ఉపశమనం లభిస్తుందని ఏసిపి ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించి, వాహనదారులను అప్రమత్తం చేయడానికి అక్కడ హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, పోలీసుల ప్రయత్నాలకు ప్రజలు సహకరిస్తేనే సురక్షితమైన రవాణా వ్యవస్థ సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ ప్రభాకర్, ఎస్సై దుర్గాదేవి, కృష్ణ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply