criticized | ఆర్థిక సంక్షోభం సృష్టించిందే మీరు..
criticized | ఆర్థిక సంక్షోభం సృష్టించిందే మీరు..
రైతు భరోసాపై మాట్లాడతారా?”
criticized | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, నేడు సంక్షేమ పథకాలు ఆగిపోవడానికి గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే కారణమని ఆయన విమర్శించారు. ఈ మేరకు మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, గులాబీ నేతల వైఖరిపై నిప్పులు చెరిగారు.
కేసీఆర్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ, “రైతులకు మేలు చేశామని చెప్పుకోవడం ఈ శతాబ్దపు అతి పెద్ద జోక్” అని పొన్నం ఎద్దేవా చేశారు. పదేళ్ల పాలనలో రైతులను గోస పెట్టి, ఇప్పుడు సభలు పెట్టి రైతు భరోసా ఇచ్చామని చెప్పడం హాస్యాస్పదమని మండిపడ్డారు.
రాష్ట్రం నేడు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని మంత్రి స్పష్టం చేశారు. వారు సృష్టించిన ఆర్థిక విధ్వంసం వల్లే కొన్ని సంక్షేమ పథకాల అమలులో జాప్యం జరుగుతోందని, ఖజానాను ఖాళీ చేసి ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉందని పొన్నం ప్రభాకర్ పునరుద్ఘాటించారు. “ఒక్కొక్కటిగా అన్ని హామీలను అమలు చేస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇప్పటికే అమలవుతున్నాయి. మిగిలిన పథకాలను కూడా క్రమ పద్ధతిలో ప్రజలకు అందిస్తాం” అని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తున్న విపక్షాల కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
