19thaprilchintana | అక్షయ తృతీయ ప్రాముఖ్యత..

19thaprilchintana | అక్షయ తృతీయ ప్రాముఖ్యత..

19thaprilchintana | అక్షయ తృతీయ అర్థం మరియు ప్రాధాన్యం
పరశురామ జయంతి మరియు ఆధ్యాత్మిక విశ్వాసాలు
సింహాచలం చందనోత్సవం ప్రత్యేకత
అక్షయ తృతీయలో దానం, ధర్మం విలువ
ఆధునిక కాలంలో అక్షయ తృతీయ అర్థం
పర్యావరణ పరిరక్షణ – అక్షయ సంపదకు మార్గం

19thaprilchintana | భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత, ఒక అంతరార్థం ఉంటుంది. అలాంటి పుణ్యదినాల్లో అత్యంత ప్రాధాన్యం కలిగినది అక్షయ తృతీయ. ”అక్షయ” అంటే క్షయించనిది, నశించనిది అనే అర్థం. అంటే ఈ రోజు చేసిన పుణ్యకార్యాలు, దానం, సత్సంకల్పాలు ఎన్నటికీ తగ్గిపోవు అనే విశ్వాసం మన సంస్కృతిలో బలంగా ఉంది. వైశాఖ మాస శుక్ల పక్ష తృతీయ నాడు జరుపుకునే ఈ పర్వదినం ధార్మికంగా, ఆర్థికంగా, సామాజికంగా కూడా గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంది.

అక్షయ తృతీయను విష్ణుమూర్తి యొక్క ఆరవ అవతారమైన పరశురాముని జన్మదినంగా భావిస్తారు. వైష్ణవ దేవాలయాలలో ఆయనను పూజిస్తారు. ఇదే రోజు సింహాచలం ఆలయంలో కొలువై ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవం వేడుక జరుగుతుంది. ఈ స్వామి వారి విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే, సంవత్సరం పొడవునా స్వామివారి విగ్రహం మందపాటి చందనం పూతతో కప్పబడి ఉంటుంది. ఈ చందనం పూత వల్ల స్వామివారి అసలు రూపం భక్తులకు కనిపించదు.

అయితే అక్షయ తృతీయ రోజు మాత్రమే ఈ చందనపు పొర తొలగించి, స్వామివారి నిజ స్వరూపాన్ని దర్శించుకునే అవకాశం లభిస్తుంది. ఈ దర్శనాన్ని ”నిజరూప దర్శనం” అని పిలుస్తారు. చందనోత్సవం రోజున ఆలయంలో విశేష పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహించబడతాయి. తెల్లవారుజామునే పూజలు ప్రారంభమై, చందనం తొలగించిన అనంతరం స్వామివారిని దర్శించడానికి భక్తులు గంటల తరబడి క్యూలో నిలబడుతారు. ఈ రోజున స్వామివారిని దర్శిస్తే అన్ని పాపాలు నశించి, సర్వసంపదలు లభిస్తాయని విశ్వాసం.

చందనోత్సవం వెనుక ఉన్న భావం కూడా ఎంతో గొప్పది. చందనం శాంతి, శుభ్రత, పవిత్రతకు ప్రతీక. స్వామివారిని చందనంతో కప్పడం ద్వారా ఆయన ఉగ్ర స్వరూపాన్ని శాంతపరచినట్లు భావిస్తారు. అక్షయ తృతీయ నాడు చందనం తొలగించడం ద్వారా స్వామివారి అసలైన దివ్యరూపంను దర్శించడం ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది.

అలాగే గంగా నది భూమికి అవతరించిన రోజుగా కూడా భావిస్తారు. మహాభారతంలో పాండవులకు అక్షయ పాత్ర లభించిన రోజు కూడా ఇదేనని విశ్వాసం. అక్షయ తృతీయ ఒక సాధారణ పండుగ కాకుండా, శాశ్వత సౌభాగ్యం, ధనసంపద, ధర్మాచరణకు ప్రతీకగా నిలుస్తుంది.

సాంప్రదాయంగా ఈ రోజు బంగారం కొనుగోలు చేయడం ఒక ప్రధాన ఆచారం. ”ఈ రోజున కొన్నది పెరుగుతుంది” అనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. అయితే, ఆధునిక సమాజంలో ఇది కొంతవరకు వ్యాపార ధోరణిగా మారిపోయిన దృశ్యం కనిపిస్తోంది. బంగారం కొనుగోలు చేయడమే అక్షయ తృతీయ సారాంశమని భావించడం సరైన దృక్పథం కాదు. అసలు భావం దానం, ధర్మం, సేవ వంటి విలువలలో ఉంది.

ఇప్పటి సమాజంలో అక్షయ తృతీయను ఎలా అర్థం చేసుకోవాలి? కేవలం ఆర్థిక లావాదేవీల దినంగా కాకుండా, మనుషుల మధ్య అనుబంధాలును బలపరచే రోజు కావాలి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, పేద విద్యార్థులకు పుస్తకాలు అందించడం, వృద్ధాశ్రమాల్లో సేవ చేయడం వంటి కార్యాలు ఈ రోజు నిజమైన అక్షయ పుణ్యంను అందిస్తాయి. సమాజంలో అసమానతలు పెరుగుతున్న ఈ కాలంలో అక్షయ తృతీయ వంటి పర్వదినాలు మనకు మానవత్వంను గుర్తు చేయాలి.

అక్షయ తృతీయను కొత్త కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. చెట్లు నాటడం, నీటి సంరక్షణకు కట్టుబడడం, పర్యావరణాన్ని కాపాడే చర్యలు చేపట్టడం కూడా ఈ రోజున చేయదగిన గొప్ప పనులే. ఇవి భవిష్యత్తు తరాలకు అక్షయ సంపదగా నిలుస్తాయి. అక్షయ తృతీయ అనేది కేవలం సంపద కోసం చేసే ఆచారం కాదు. అది మన ఆలోచనలు, మన విలువలు, మన బాధ్యతలును పునరాలోచించుకునే అవకాశం. సంపదను కూడబెట్టడం కంటే, సద్గుణాలును పెంపొందించడం ముఖ్యం.

ఆళవందార్‌ వేణు మాధవ్‌
8686051752

Leave a Reply