ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లో మావోయిస్టు అగ్ర నాయకులు ఉన్నట్లు సమాచారం అందడంతో కోబ్రా, డీఅర్జీ, జిల్లా బలగాల సంయుక్త ఆధ్వర్యంలో ఉదయం సెర్చింగ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో తారసపడ్డ మావోయిస్టులు భద్రతాబలగాలపై కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన సుమారు 500 మందితో కూడిన భద్రతా దళాలు నలుదిక్కుల నుంచి మావోయిస్టులను చుట్టుముట్టాయి.
మావోయిస్టుల కాల్పులతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఇరు వర్గాల మధ్య నాలుగు విడతలుగా కాల్పులు జరిగాయి. జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే దట్టమైన అటవీ మార్గంలో పారిపోయారు. కాల్పుల విరమణ అనంతరం జవాన్లు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకొని గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలో ఎదురు కాల్పుల్లో మృతి చెందిన ఇద్దరు మావోయిస్టులతో పాటు వారికి సంబంధించిన మారణాయుధాలు, ఇతర వస్తు, సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనపరుచుకున్నాయి. మృతుల్లో ఒక మహిళా మావోయిస్టు ఉన్నట్లు సమాచారం. భద్రత దళాలు ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం ముమ్మరంగా గాలింపులు చేపడుతున్నాయి.