కొండపల్లి బొమ్మల పండుగను విజయవంతం చేద్దాం…

కొండపల్లి బొమ్మల పండుగను విజయవంతం చేద్దాం…
- 18 నుంచి 20 వరకు మన ఊరి పండుగలా మేళా
- మూడు రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు, రంగోలి పోటీలు, చిల్డ్రన్స్ ఫ్యాషన్ షో
- ఖిల్లా మెట్ల మార్గాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో 18న ట్రెక్కింగ్
- మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన మైలవరం ఎమ్మెల్యే వసంత
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 18 నుంచి 20 వరకు నిర్వహించే కొండపల్లి బొమ్మల పండుగను విజయవంతం చేయాలని మైలవరం శాసన సభ్యుడు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. కొండపల్లి టీడీపీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంతో చారిత్రాత్మక ప్రసిద్ధి గాంచిన కొండపల్లి ఖిల్లా, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొండపల్లి బొమ్మల కళను సజీవంగా నిలిపి ఇంకా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
అందులో భాగంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆధ్వర్యంలో పర్యాటక శాఖ మూడు రోజులు కొండపల్లి బొమ్మల పండుగ నిర్వహిస్తుందన్నారు. కొండపల్లి ఖిల్లా మెట్ల మార్గాన్ని తిరిగి పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా ఈ నెల 18న ఖిల్లా పైకి ట్రెక్కింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదేరోజు ఉదయం 10 గంటల నుంచి కొండపల్లి బొమ్మల పండుగ ప్రారంభమవుతుందన్నారు. ఇందులో మూడు రోజుల పాటు బొమ్మల ఎగ్జిబిషన్, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, రంగోలి పోటీలు, చిల్డ్రన్స్ ఫ్యాషన్ షో, కీలు బొమ్మలాట, తోలుబొమ్మలాట, బొమ్మల కొలువు వంటివి ప్రదర్శించనున్ళట్లు చెప్పారు.

మన ఊరి పండుగలా భావించి హస్త కళాకారులే కాకుండా కొండపల్లి, ఇబ్రహీంపట్నం మరియు మైలవరం నియోజకవర్గ ప్రజలంతా కొండపల్లి బొమ్మలను మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కొండపల్లి బొమ్మల పండుగలో భాగస్వాములు కావాలని కోరారు. మూడు రోజుల పండుగలో ఒక రోజు పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ హాజరయ్యే అవకాశం ఉందన్నారు. అనంతరం పండుగ కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి శిల్ప, కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చంద్రబాబు, లోకేష్ కు కృతజ్ఞతలు…
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ను నియమించడం పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు, కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ 185 మందిని కార్యవర్గంలోకి తీసుకుంటే అందులో తనకు స్థానం కల్పించడం సంతోషకరమన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను తప్పకుండా నిర్వర్తిస్తానని, కూటమి వాణి, బాణి వినిపిస్తానన్నారు.
