అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి

అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి
టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి
తొర్రూరు, ఆంధ్రప్రభ : రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధనకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి తెలిపారు. హ్యూమన్ రైట్స్ ఫర్ సోషల్ జస్టిస్ వ్యవస్థాపకులు మంగళపల్లి హుస్సేన్ ఆధ్వర్యంలో మంగళవారం డివిజన్ కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఝాన్సీ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఆయా రంగాల్లో కృషిచేసిన పలువురికి హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో పురస్కారాలు ప్రధానం చేశారు. హుస్సేన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ తో కలిసి ఝాన్సీ రెడ్డి మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆయన రాజ్యాంగ స్ఫూర్తితోనే ప్రజా ప్రభుత్వం నడుస్తోందని స్పష్టం చేశారు. దళితులు, అణగారిన వర్గాల అభివృద్ధి, విద్య, ఉద్యోగ అవకాశాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో పాలన సాగుతోందని, ఇది దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రభుత్వం అని పేర్కొన్నారు. విద్య ఒక్కటే పేదల బతుకులను మారుస్తుందని అంబేద్కర్ చెప్పిన మాటలను అనుసరిస్తూ ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. దళిత, ఆదివాసీ విద్యార్థుల కోసం మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలను పెంచినట్లు వివరించారు.
దళిత వర్గానికి చెందిన వ్యక్తికి డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రిగా అవకాశం కల్పించడం ద్వారా, సామాజిక సమానత్వానికి ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని,ఆ దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. హ్యూమన్ రైట్స్ ఫర్ సోషల్ జస్టిస్ సేవలు ప్రశంసనీయమని, హక్కుల కోసం సంస్థ పనిచేయడం అభినందనీయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లేగా రామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు గొల్లపెల్లి మహేష్. అశోక్ గౌడ్, డివిజన్ కమిటీ సభ్యులు కుమ్మరి రామ్మూర్తి, డివిజన్ ప్రెసిడెంట్ పల్లెర్ల రమేష్, మండల ప్రెసిడెంట్ ఉమేష్, సతీష్, కుంభం మహేష్ గౌడ్, శ్రీనివాస్, మహంకాళి మల్లేష్, పాల్గొన్నారు.
