మున్సిపాలిటీలో మోనార్క్ పాలన…

మున్సిపాలిటీలో మోనార్క్ పాలన…

మున్సిపల్ కమిషనర్ తీరుపై మండిపడుతున్న కౌన్సిలర్లు
అక్రమ వెంచర్లపై మున్సిపల్ నిర్లక్ష్యం .. ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహం
మున్సిపల్ శాఖపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు

అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూలు జిల్లా, అచ్చంపేట మున్సిపల్ కమిషనర్ వ్యవహార శైలిపై కౌన్సిలర్లు, అక్రమ వెంచర్లకు అనుమతులపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ ఒంటెద్దు పోకడలు అవలంబిస్తూ ప్రజాప్రతినిధులను పట్టించుకోకపోవడం, ప్రభుత్వ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేయడం వంటి అంశాలపై సోషల్ మీడియా వేదికగా బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

శనివారం మహాత్మ జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా పట్టణంలోని తహసిల్దార్ వేడుకలు ఘనంగా నిర్వహించినప్పటికీ, మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించకపోవడం కౌన్సిలర్ల ఆగ్రహానికి దారితీసింది. బీసీల పట్ల నిర్లక్ష్య ధోరణి చూపుతున్నారని వారు విమర్శిస్తున్నారు. ఇక ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా వేదికలు, ఇతర అధికారిక కార్యక్రమాలకు కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకపోవడం పట్ల కూడా వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పట్టణ అభివృద్ధి విషయానికొస్తే, పరిశుభ్రత లోపం, కాలనీల్లో మౌలిక వసతుల సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ, కమిషనర్ ఎప్పుడూ ప్రజలతో లేదా కౌన్సిలర్లతో కలిసి పర్యటించలేదని ఆరోపిస్తున్నారు.

అక్రమ వెంచర్లపై పెరుగుతున్న ఆగ్రహం…

అదేవిధంగా, పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వెంచర్లు పెరుగుతున్నప్పటికీ వాటిపై చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు, ప్రజా ప్రతినిధులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కోర్టుల్లో కేసులు నడుస్తున్న భూములపై కూడా వెంచర్లు కొనసాగుతుండటం గమనార్హమని పేర్కొంటున్నారు. అక్రమాలకు మున్సిపల్ శాఖ పరోక్ష సహకారం అందిస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కోర్టు ఆదేశాలను లెక్కచేయరా..?

అచ్చంపేట పట్టణానికి చెందిన పాండే రాజమ్మ మాట్లాడుతూ, సర్వే నంబర్ 163లో ఉన్న భూమిపై కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ అక్రమంగా వెంచర్లు చేపడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై 2025 సెప్టెంబర్ 29న, 2026 మార్చి 23 న మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

వెంటనే చర్యలు తీసుకోవాలి..

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అక్రమ వెంచర్లపై తక్షణ చర్యలు తీసుకొని, ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలని కౌన్సిలర్లు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు పారదర్శకంగా వ్యవహరించి తమపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని కోరుతున్నారు.

Leave a Reply