Conspiracy | 36 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

Conspiracy | 36 గంటల్లోనే ఛేదించిన పోలీసులు
Conspiracy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లోని ధార్ జిల్లాలో సంచలనం రేపిన హత్య కేసు వెనుక అసలు నిజం బయటపడింది. తొలుత దోపిడీగా కనిపించిన ఈ ఘటన, భార్య తన ప్రియుడితో కలిసి పన్నిన కుట్ర (Conspiracy ) గా పోలీసులు తేల్చారు.
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా గొండిఖేడ గ్రామంలో దేవకృష్ణ అనే వ్యక్తి హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. మొదట ఈ కేసును దోపిడీ దొంగల పని అని భావించిన పోలీసులు, దర్యాప్తులో సంచలన విషయాలను వెలికితీశారు.

అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి భర్తను హత్య చేసి, సామాన్లు దోచుకెళ్లారని అతని భార్య ప్రియంక ఫిర్యాదు చేసింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇల్లంతా చిందరవందరగా ఉండటం, ప్రియంక (Priyanka) ఏడుస్తూ కనిపించడం వల్ల తొలుత దోపిడీ కేసుగా భావించారు.
అయితే సీన్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు ఇది ముందుగానే ప్లాన్ చేసి సృష్టించిన నకిలీ క్రైమ్ సీన్ అని అనుమానించారు. కుటుంబ సభ్యులను విచారించగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని, ప్రియంక తన భర్తను అవమానించేదని తెలిసింది.
దర్యాప్తులో ప్రియంకకు కమలేష్ (Kamlesh) అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు బయటపడింది. ఈ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని ప్రియంక, కమలేష్ కలిసి పథకం వేసి, సురేంద్ర అనే వ్యక్తికి రూ.1 లక్ష సుపారీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
పథకం ప్రకారం దేవకృష్ణ (Devkrishna) నిద్రలో ఉన్న సమయంలో నిందితులు అతనిపై దాడి చేసి హత్య చేశారు. అనంతరం దోపిడీ జరిగినట్లు చూపించేందుకు ఇంట్లో వస్తువులను చిందరవందరగా వేసి నాటకం ఆడారు. కేసు నమోదైన 36 గంటల్లోనే ధార్ జిల్లా ఎస్పీ మయాంక్ అవస్థీ నేతృత్వంలోని పోలీసులు అసలు నిజాన్ని బయటపెట్టారు. సాంకేతిక ఆధారాలు, విచారణలో వచ్చిన విరుద్ధతలతో ప్రియంక నిజాన్ని ఒప్పుకుంది. ప్రస్తుతం పోలీసులు ప్రియంక, కమలేష్‌ను అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న సురేంద్ర కోసం గాలిస్తున్నారు.
