Minister | పొంగులేటి మంత్రిలా వ్యవహరించడం లేదు..

Minister | పొంగులేటి మంత్రిలా వ్యవహరించడం లేదు..

Minister | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నాదర్‌గుల్ భూముల వివాదం తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడెక్కుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర విమర్శలు గుప్పిస్తూ సంచలన ఆరోపణలు చేశారు.

నాదర్‌గుల్‌లో 373 ఎకరాల భూమి కబ్జా వ్యవహారాన్ని బయటపెట్టడంతో మంత్రి పొంగులేటి మతిస్థిమితం కోల్పోయి బజారు భాషలో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. భూముల అంశంపై మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారని విమర్శించారు.

వనపర్తిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, లక్ష్మారెడ్డి, బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి హరీశ్‌రావు మాట్లాడారు. ఈ సందర్భంగా నాదర్‌గుల్ భూముల వ్యవహారంలో మంత్రి అడ్డంగా దొరికిపోయి అబద్ధాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు.

పొంగులేటి అక్రమాలను అడుగడుగునా బయటపెడుతూనే ఉంటామని, ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్‌కు పాల్పడిందని, ఆ వ్యవహారంపై తామే అధికారులను పంపి చర్యలు తీసుకున్నామని తెలిపారు.

అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటీసుల గురించి ప్రస్తావించినప్పుడు ఎందుకు స్పందించలేదని పొంగులేటిని ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం తాను మాత్రమే కాకుండా ఇతరులూ అవినీతిలో ఉన్నారని పరోక్షంగా ఒప్పుకుంటున్నాడని విమర్శించారు.

ఇప్పటికైనా తప్పును ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలతో నాదర్‌గుల్ భూముల వ్యవహారం రాజకీయంగా మరింత హీట్ పెంచుతోంది. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే లు అల వెంకటేశ్వర్ రెడ్డి, అంజయ్య యాదవ్, రాష్ట్ర నాయకులు నాగం తిరుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply