మెడిసిటి (MIMS)లో ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

మేడ్చల్, ఆంధ్రప్రభ : ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మెడిసిటి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (MIMS)లో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మానవ, జంతు, పర్యావరణ ఆరోగ్యాలు పరస్పర సంబంధితమైనవని, “వన్ హెల్త్” (One Health) విధానంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని వైద్య నిపుణులు పేర్కొన్నారు.

ఈ ఏడాది “ఆరోగ్యం కోసం అందరం – సైన్స్‌కు తోడుగా” (Together for Health – Stand with Science) అనే ఇతివృత్తంతో నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులకు రంగోళి, క్విజ్, డిజిటల్ పోస్టర్ తయారీ పోటీలను నిర్వహించారు.

కమ్యూనిటీ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. అంకుష్ పవార్ మాట్లాడుతూ, ఆధారాలతో కూడిన శాస్త్రీయ వైద్య విధానాలు (Evidence-based science), అంతర్జాతీయ పరిశోధనల ప్రాముఖ్యతను వివరించారు. డా. హేమలత సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా ఆరోగ్య సమాచారాన్ని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లే మార్గాలను వివరించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. శైలేంద్ర మాట్లాడుతూ, కోవిడ్ వంటి మహమ్మారులు జంతువుల నుంచే వ్యాప్తి చెందినట్లు గుర్తుచేసి, పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తూ మానవ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సాధ్యం కాదని హెచ్చరించారు.

పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ డా. దేవేంద్ర సింగ్ నేగి, వైస్ ప్రిన్సిపాల్ డా. శైలేంద్ర బహుమతులు అందజేశారు. రంగోళి విభాగంలో శిరిచందన బృందం ప్రథమ బహుమతి సాధించగా, డిజిటల్ పోస్టర్ విభాగంలో హర్ష పండిత్ ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ కార్యక్రమాన్ని కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డా. లియోవాజ్, ప్రొఫెసర్ డా. ఈనాక్షి పర్యవేక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. దేవేంద్ర సింగ్ నేగి, వైస్ ప్రిన్సిపాల్ డా. శైలేంద్ర, గైనకాలజీ విభాగాధిపతి డా. కల్పన, ప్రొఫెసర్లు డా. పవన్ కుమార్ శర్మ, డా. అంకుష్ పవార్, డా. హేమలతతో పాటు వైద్య, నర్సింగ్, పారామెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు.