ఐపీఎల్ చూసి వస్తుంటే..

ఐపీఎల్ చూసి వస్తుంటే..

గంగవరం, ఆంధ్రప్రభ : న్యాయస్థానంలో నిత్యం విధినిర్వహణలో తలమునకలై ఉంటారు. ఎప్పుడో సెలవులలో మాత్రమే కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు సరదాగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడుపుతారు. ఈ నేపథ్యంలో ఆదివారం సెలవు రోజు కావడం పైగా క్రికెట్ ఐపీఎల్ బెంగళూరులోనే జరుగుతున్న నేపథ్యంలో 6 గురు కోర్టు సిబ్బంది కారులో తిరుపతి నుండీ బయలు దేరి బెంగళూరుకు వచ్చి క్రికెట్ మ్యాచ్ చూసిన ఆనందంలో తిరిగి తిరుపతికి పయనమయ్యారు. కానీ వాళ్ళ ఆనందం ఇంతలోనే అవిరయ్యింది.

దాదాపు సోమవారం ఉదయం 2.30గంటల సమయంలో పలమనేరు నియోజకవర్గ పరిధిలోని గంగవరం బైపాస్ లోకి ప్రవేశించి ఇక్కడి వైస్సార్ జుంక్షన్ సమీపంలో ఓ లారీని వీళ్ళు ప్రయాణిస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తిరుపతి కోర్టు నందు జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న యుగంధర్ (47), మరొకరు ఫీల్డ్ అసిస్టెంట్ హరీష్ (36) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన నలుగురిలో ఇద్దరు స్వల్పంగా గాయపడగా, మరో ఇద్దరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీంతో మృతులను గాయపడిన బాధితులను పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి గల కారణాలు పోలీసుల విచారణలో ఇంకా తెలియాల్సి ఉంది.

బైపాస్ రోడ్డులో నిత్యం ప్రమాదాలే..
మూడు నెలల నుండీ ఈ గంగవరం బైపాస్ రోడ్డులోని పలుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదా లతో పదుల సంఖ్యలో మృతి చెందారు. ఈ కారణంగా అత్యంత ప్రమాదకరమైన రోడ్డుగా ప్రజల మదిలో నాటుకొని పోయింది. ప్రమాదాలను నివారించేందుకు జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. వాటిని వెంటనే అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అయినా ఇక్కడ రోడ్డుప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply