గిరిజన గ్రామాల్లో డిప్యూటీ కలెక్టర్ల పర్యటన..

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ పరిధిలో గిరిజన గ్రామాల్లో డిప్యూటీ కలెక్టర్ల బృందం రెండో రోజు పర్యటించి గిరిజనుల జీవన స్థితిగతులను పరిశీలించింది.

శనివారం పీఎంఆర్సీలో టీపీసీసీ ప్రతినిధి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను బృంద సభ్యులు మర్యాదపూర్వకంగా కలుసుకుని చర్చించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, పాలనా సేవలపై అధ్యయనం చేయాలని టీపీసీసీ సూచించినట్లు సమాచారం.

అనంతరం ఉట్నూర్ మండలంలోని మారుమూల ప్రాంతమైన కామాయిపేట గ్రామాన్ని సందర్శించారు. కొలాం గిరిజనులతో మాట్లాడి త్రాగునీరు, విద్యుత్, వర్షాకాలంలో రవాణా సమస్యలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు—ప్రధానమంత్రి జన్‌మన్, సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ద్వారా అందుతున్న లబ్ధులపై వివరాలు సేకరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని కూడా అడిగి తెలుసుకున్నారు.

రోడ్లు సరిగా లేక వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు బృంద దృష్టికి తీసుకువచ్చారు. గిరిజన విద్యార్థులు విద్యలో రాణించాలని, గ్రామ సభలు నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఆరోగ్యం, విద్య, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రహదారి సౌకర్యం లేని గ్రామాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అంగన్‌వాడీ కేంద్రాలు, పంచాయతీ భవనాలు, పాఠశాలల పరిసరాలను పరిశీలించారు. పీవీటీజీ కొలాం గిరిజన విద్యార్థులతో మాట్లాడి, ప్రభుత్వ విద్యావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రోత్సహించారు.

తరువాత ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో గల గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చరిత్ర గురించి తెలుసుకున్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో బాలికల కోసం తయారు చేస్తున్న పోషకాహార మోవ లడ్డూ (ఇప్పపువ్వు) పరిశ్రమను సందర్శించి నిర్వాహకులతో మాట్లాడారు. మోవ లడ్డూ రుచి చూసి ప్రశంసించారు.

ఈ పర్యటనలో ఉట్నూర్ ఐటీడీఏ పీవీటీజీ ఏపీఓ ఆత్రం భాస్కర్, ఏజెన్సీ విద్యాశాఖ అధికారులు, ఇతర అధికారులు, గిరిజనులు పాల్గొన్నారు.

Leave a Reply