BRS | ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో వీడిన ఉత్కంఠ

BRS | ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో వీడిన ఉత్కంఠ
BRS | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : భారీ బందోబస్తు, ఆందోళనల మధ్య జరిగిన ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. సంఖ్యాబలం కలిగిన బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పదవిని దక్కించుకుంది. చైర్మన్‌గా సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా బీజేపీ పార్టీకి చెందిన ముత్యాల శ్యామల భాస్కర్ ఎన్నికయ్యారు.
చైర్మన్ ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి విజయం సాధించారు. ఓటింగ్ ప్రక్రియకు ముందు కాంగ్రెస్ కౌన్సిలర్లు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఎన్నిక ఉద్రిక్తంగా సాగింది.
బీఆర్ఎస్ తరపున చైర్మన్ అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ తరపున ఆకుల యాదగిరి పేర్లు ప్రతిపాదించబడ్డాయి. సభ్యులు చేతులు ఎత్తే విధానం ద్వారా ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్‌లో మెజారిటీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలపడంతో సుదర్శన్ రెడ్డి విజయం సాధించారు.
అయితే ఎన్నిక ప్రారంభానికి ముందే కాంగ్రెస్ కౌన్సిలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముగ్గురు కౌన్సిలర్లపై కోర్టులో కేసులు కొనసాగుతున్నాయని, తీర్పు వచ్చే వరకు ఎన్నికను వాయిదా వేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారి స్పందిస్తూ, తాము స్వచ్ఛందంగా ఎన్నిక నిర్వహించడం లేదని, హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాల మేరకు నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నిక నిర్వహిస్తున్నామని తెలిపారు. చట్టపరమైన అడ్డంకులు లేవని పేర్కొంటూ ఎన్నికల ప్రక్రియను కొనసాగించారు.
