సంక్షేమ హాస్టళ్లలో నాణ్యమైన వసతులపై దృష్టి పెట్టాలి..

సంక్షేమ హాస్టళ్లలో నాణ్యమైన వసతులపై దృష్టి పెట్టాలి..
ఎస్సీ, బీసీ హాస్టళ్ల పనితీరును మెరుగుపరచాలి…
హాస్టళ్లలో పారిశుధ్యం, త్రాగునీరు, ఆహార నాణ్యతపై కఠిన పర్యవేక్షణ ఉండాలి…
హాస్టళ్లలో మెనూ అమలు, వసతులపై నిరంతర తనిఖీలు అవసరం..
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా..
నంద్యాల బ్యూరో ఆంధ్రప్రభ : జిల్లాలోని ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాల పనితీరును మరింత మెరుగుపరచి, విద్యార్థులకు నాణ్యమైన వసతులు కల్పించడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంక్షేమ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాలపై సంబంధిత సంక్షేమ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ అధికారి చింతామణి, బీసీ సంక్షేమ అధికారి జగ్గయ్య తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సోషల్ వెల్ఫేర్ శాఖ పనితీరు తగిన స్థాయిలో ఉన్నప్పటికీ, బీసీ వెల్ఫేర్ శాఖ పనితీరు ఆశించిన స్థాయిలో లేదని పేర్కొన్నారు.
హాస్టళ్లలో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందుతున్నదో లేదో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి హాస్టల్‌లో మెనూ వివరాలతో పెద్ద హోర్డింగ్‌లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సంక్షేమ అధికారులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, హాస్టళ్లలో నివసిస్తున్న పేద విద్యార్థులను తమ సొంత పిల్లలుగా భావించి, మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఆహార నాణ్యత, వార్డెన్ల పనితీరు, త్రాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ వంటి అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. జిల్లాలో నిర్వహించిన సమీక్షలో కొన్ని హాస్టళ్లు అత్యల్ప సానుకూలత సాధించగా, మరికొన్ని హాస్టళ్లు అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు వెల్లడైందన్నారు. మంచి పనితీరు కనబరిచిన హాస్టళ్లను అభినందిస్తూ, తక్కువ పనితీరు కనబరిచిన హాస్టళ్ల వార్డెన్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అలాగే, “జీరో వేస్ట్ ఇన్‌స్టిట్యూషన్స్” లక్ష్యంతో ప్రతి హాస్టల్ మరియు ప్రభుత్వ సంస్థలో వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. తడి చెత్తతో కంపోస్ట్ తయారీ, చెత్త వర్గీకరణ కోసం గ్రీన్, బ్లూ, రెడ్ బిన్‌ల ఏర్పాటు, పొడి చెత్త ద్వారా ఆదాయం సాధించడం వంటి చర్యలను తప్పనిసరిగా చేపట్టాలని తెలిపారు. హాస్టల్ ప్రాంగణాల్లో మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించి పచ్చదనాన్ని పెంచాలని సూచించారు. వసతి గృహాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని, త్రాగునీరు, పారిశుధ్యం, ఆహార నాణ్యత, వార్డెన్ అందుబాటు వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. హాస్టళ్లలో ఆర్.ఓ ప్లాంట్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తూ సంక్షేమ వసతి గృహాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
