విద్యార్థులు సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలి

తొర్రూరు, ఆంధ్రప్రభ : పోటీ ప్రపంచంలో విద్యార్థినీ, విద్యార్థులు సెల్ ఫోన్ కు దూరంగా ఉండి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని వికాస్ పాఠశాల కరస్పాండెంట్ తాళ్లపల్లి రమేష్ అన్నారు.డివిజన్ కేంద్రంలోని వికాస్ పాఠశాలలో ప్రపంచ బాలల పుస్తక దినోత్సవం సందర్భంగా మొబైల్ ఫోన్ వద్దు – పుస్తకాలు ముద్దు అనే అంశంపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు పుస్తకాలు చదవడం వల్ల కలిగే ప్రయోజనాలను అలాగే సెల్ ఫోన్ ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలను గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలిపారు.
వెయ్యికి పైగా పుస్తకాలను విద్యార్థుల ముందు ఉంచి పుస్తక పఠనంపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తాళ్లపల్లి రమేష్ మాట్లాడుతూ విద్యార్థులు సెల్ఫోన్ వదిలి పుస్తకాలు పట్టడం వల్ల ఉజ్వలమైన అయిన భవిష్యత్తుతో పాటు సోషల్ మీడియాలో వచ్చే చెడు ప్రభావాలవైపు వెళ్లకుండా ఉంటారని,దానివల్ల జ్ఞానం పెరిగే అవకాశం ఉందన్నారు.
సెల్ ఫోన్ వాడటం వల్ల కంటి చూపు మందగించడం, మెదడు యొక్క ఆలోచన శక్తి తగ్గిపోవడం జరుగుతుందన్నారు. పుస్తకాలు చదవడం వల్ల నాలెడ్జిని పెంచుకొని రాబోయే పోటీ ప్రపంచాన్ని ఎదుర్కోవచ్చని తెలిపారు. పాఠశాలలో ప్రత్యేకమైన లైబ్రరీని ఏర్పాటు చేసి విద్యార్థులకు పుస్తక పఠనంపై అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కెవి రెడ్డి, శ్రీలత, ప్రిన్సిపాల్ వేణుమాధవ్, నాగరాజు, వైస్ ప్రిన్సిపల్ రాజు, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
