కటోర సాధనతోనే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు…
కటోర సాధనతోనే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు…
- జిల్లా స్థాయి శాప్ వాటర్ స్పోర్ట్స్ పోటీలు ప్రారంభం
- సెట్కూర్ సీఈవో డాక్టర్ వేణుగోపాల్
కర్నూలు స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : క్రీడాకారులు తమకు నచ్చిన క్రీడల్లో కటోర సాధన చేస్తేనే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు అని సెట్కూర్ సీఈవో డాక్టర్ వేణుగోపాల్ అన్నారు. గురువారం గార్గేయపురం సిటీ ఫారెస్ట్ వద్ద ఉన్న నాగరవనం చెరువులో కర్నూలు జిల్లా స్థాయి శాప్ లీగ్ వాటర్ స్పోర్ట్స్ పోటీలను జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, రాష్ట్ర డ్రాగన్ బోట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అవినాష్ గుప్తా, రాష్ట్ర హ్యాండ్ బాల్ సంఘం కోశాధికారి డాక్టర్ రుద్ర రెడ్డి, వాటర్ స్పోర్ట్స్ కోచ్ చంద్రశేఖర్ తో కలిసి ఆయన జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాను రెండు శాతం నుంచి మూడు శాతానికి పెంచిందన్నారు. క్రమశిక్షణతో ప్రతిరోజు అంకితభావంతో సాధన చేస్తే మంచి ఫలితాలు సిద్ధిస్తాయన్నారు. యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు శాప్ ఆధ్వర్యంలో లీగ్ పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు మాట్లాడుతూ జిల్లాస్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన క్రీడాకారులను ఈనెల 11 నుంచి 12 వరకు ఎన్టీఆర్ జిల్లాలో జరగబోయే రాష్ట్ర స్థాయి శాప్ వాటర్ స్పోర్ట్స్ లీగ్ పోటీలలో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలలో జిల్లా క్రీడాకారులు విజేతలుగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర డ్రాగన్ బోట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అవినాష్ గుప్తా మాట్లాడుతూ పోటీలకు సంబంధించి టెక్నికల్ సపోర్ట్ ను అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఏ ఫెన్సింగ్ శిక్షకుడు మహేశ్వరరావు, జిమ్నాస్టిక్స్ శిక్షకుడు పవన్, జిల్లా వాటర్ స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు గంగాధర్, బోల్ట్, తదితరులు పాల్గొన్నారు.
