supervisor | ఫినాయిల్ తాగి ఆత్మహత్యా యత్నం..
supervisor | ఫినాయిల్ తాగి ఆత్మహత్యా యత్నం..
జీతాల కోసం ధర్నా చేస్తే అధికారులు కక్షపూరితం..
supervisor | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న ఈగల్ హంటర్ సంస్థకు చెందిన ముగ్గురు సూపర్వైజర్లు ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. సోమవారం జిల్లా ప్రభుత్వం సర్వజన ఆస్పత్రిలో సూపర్వైజర్లుగా పనిచేస్తున్న నాగన్న, చెన్నయ్య, ఆది అనే ముగ్గురు ఈ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రి సిబ్బంది గుర్తించి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పినట్లు సమాచారం.
బాధితులు మాట్లాడుతూ, గతంలో ఎంఓయూ ప్రకారం జీతాలు ఇవ్వాలని ధర్నాలు చేసిన విషయాన్ని కారణంగా చూపిస్తూ తమను కక్షపూరితంగా సూపర్వైజర్ పోస్టుల నుంచి సెక్యూరిటీ గార్డులుగా మార్చారని ఆరోపించారు. 2014 నుంచి నంద్యాల ఆసుపత్రిలో పనిచేస్తున్నప్పటికీ తమపై ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా ఇతర జిల్లాలకు బదిలీ చేసి అవమానకరంగా విధులు మార్చారని ఆరోపించారు.
అయితే ఈగల్ హంటర్ సంస్థ ప్రతినిధులు మాత్రం ఎంఓయూ నిబంధనల ప్రకారం సూపర్వైజర్ పోస్టుకు డిగ్రీ అర్హత తప్పనిసరి అని పేర్కొన్నారు. కొత్త నిబంధనల ప్రకారం అర్హత ఉన్న వారినే సూపర్వైజర్లుగా కొనసాగిస్తున్నామని తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాదిత కుటుంబాలు మాకు న్యాయం జరగాలని కోరుతున్నారు.
