వేసవిలో ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి…

వేసవిలో ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి…
రోడ్డు భద్రత కు ఆధునిక పరికరాల పంపిణీ
రోడ్డు ప్రమాదాల నివారణకు గట్టి చర్యలు
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లాలో ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్య పరిరక్షణతో పాటు , రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రత ను బలోపేతం చేసే దిశగా కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ గట్టి చర్యలు చేపట్టామని తెలిపారు. బుధవారం కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులకు రక్షణ కిట్లు, హైవే పెట్రోలింగ్ మొబైల్ పోలీసులకు ఆధునిక పరికరాలు పంపిణి చేశారు.
కార్పొరేట్ సామాజిక బాధ్యతతో కర్నూలు మెడికవర్ హాస్పిటల్ సహకారంతో కర్నూలు ట్రాఫిక్ పోలీసులకు చలువ అద్దాలు, వాటర్ బాటిల్స్, కూల్ వాటర్ క్యాన్స్, టోపీలు, గ్లూకోజ్-డి ప్యాకెట్లు అందజేశామన్నారు. కర్నూలు జిల్లాలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతున్న నేపథ్యంలో, ట్రాఫిక్ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వర్తించాలన్నారు. వేసవిలో రోడ్ల పై గంటల తరబడి ఎండలో విధులు నిర్వహించే ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. నగరంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని, ప్రజలు కూడా ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలన్నారు.

అదే విధంగా నేషనల్ హైవేలలో ఎక్కడైనా రాత్రి వేళలలో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ట్రాఫిక్ అంతరాయం కాకుండా , వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా రోడ్డు డైవర్షన్స్ చేసే విధంగా, సత్వరమే స్పందించే విధంగా రోడ్డు భద్రతా చర్యలలో భాగంగా, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (మహబూబ్ నగర్), కెనరా బ్యాంక్ సహకారంతో హైవే పెట్రోలింగ్ మొబైల్ పోలీసులకు రెఫ్లెక్టివ్ (రేడియం) జాకెట్లు, ఇండికేటింగ్ కోన్స్, కంబళ్లు, సుత్తెలు, డ్రాగన్ లైట్లు, లైటింగ్ బాటన్స్ అందజేశామన్నారు.

రోడ్డు ప్రమాదాలను నివారించడం, ప్రాణ నష్టాన్ని తగ్గించడం, ప్రయాణికుల భద్రతను పెంపొందించడం కోసం గట్టి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాద సమయాలలో ప్రాణాపాయం నుంచి రక్షణ పొందవచ్చన్నారు.

ఈ కార్యక్రమంలో కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ సీఐ మధుసూదన్ రావు, ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్, టూ టౌన్ సీఐ నాగరాజరావు తో పాటు ట్రాఫిక్ ఎస్సైలు, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, నేషనల్ హైవే అధికారులు పాల్గొన్నారు .
