కర్నూలులో బడ్జెట్ ఔట్రీచ్ సమావేశం..

కర్నూలులో బడ్జెట్ ఔట్రీచ్ సమావేశం..

సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించిన ప్రభుత్వం: మంత్రి నిమ్మల.
తుంగభద్ర, శ్రీశైలం, హంద్రీ-నీవా పనులకు వేగం.

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన 2026-27 బడ్జెట్ ఔట్రీచ్ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, రాయలసీమ అభివృద్ధి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి విస్తృతంగా వివరించారు. కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ గుప్తా, జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
తుంగభద్ర డ్యామ్ గేట్ల మార్పిడి వేగవంతం,తుంగభద్ర డ్యామ్‌కు సంబంధించిన గేట్ల మార్పిడి పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. మొత్తం 33 గేట్లలో ఇప్పటికే 19 గేట్లు కొత్తగా అమర్చామని, మిగిలిన గేట్లను మే నెలాఖరుకల్లా పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ పనుల ద్వారా నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు భద్రతా ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.

శ్రీశైలం ప్లంజ్ పూల్‌కు మరమ్మతులు

శ్రీశైలం ప్రాజెక్టులోని ప్లంజ్ పూల్ ప్రమాద స్థితిలో ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం నిపుణుల సూచనల మేరకు నిధులు కేటాయించి మరమ్మతులు చేపట్టిందని తెలిపారు. దీని ద్వారా ప్రాజెక్టు భద్రతను మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు.

హంద్రీ-నీవా ప్రాజెక్టుకు ఊపిరి

హంద్రీ-నీవా ప్రాజెక్టు గతంలో నిర్లక్ష్యానికి గురైందని మంత్రి పేర్కొన్నారు. మోటార్లకు విద్యుత్ బిల్లులు కూడా చెల్లించని పరిస్థితి ఉండేదని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే కాలువ పనులను పూర్తి చేసి 730 కిలోమీటర్ల దూరంలోని కుప్పం వరకు నీటిని అందించగలిగిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో సాగునీటి విస్తీర్ణం పెరిగిందని చెప్పారు.పోలవరం ప్రాజెక్టు పునరుద్ధరణ
విధ్వంసానికి గురైన పోలవరం ప్రాజెక్టును తిరిగి గాడిలో పెట్టామని మంత్రి తెలిపారు. 2027 నాటికి ప్రాజెక్టు పూర్తి చేసే లక్ష్యంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. రాష్ట్ర సాగునీటి భవిష్యత్తుకు పోలవరం కీలకమని పేర్కొన్నారు.
రాయలసీమలో చెరువుల పునరుజ్జీవనం
గతంలో ఎప్పుడూ లేని విధంగా రాయలసీమలో చెరువులు నిండుకుండలా కళకళలాడుతున్నాయని మంత్రి తెలిపారు. సాగునీటి నిర్వహణలో తీసుకున్న చర్యలు ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. దీని వల్ల రైతులకు నీటి లభ్యత మెరుగుపడిందని పేర్కొన్నారు.

కర్నూలు పశ్చిమ ప్రాంత అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

కర్నూలు పశ్చిమ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని మంత్రి తెలిపారు. త్వరలోనే ఆ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వ్యాఖ్యలు

రాష్ట్ర విభజనతో పాటు గత పాలనలో ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని మంత్రి పేర్కొన్నారు. 2024 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని అన్నారు. ప్రస్తుతం ప్రధాని మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నారని తెలిపారు.

సంక్షేమం-అభివృద్ధి రెండూ సమానంగా

ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి ముందుకు సాగుతోందని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ అప్పులపై వడ్డీలు చెల్లిస్తూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు, పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు.
విద్య, సంక్షేమ పథకాల అమలు
మెగా డీఎస్సీ ద్వారా 15,941 టీచర్ పోస్టులు భర్తీ చేసినట్లు మంత్రి తెలిపారు. ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ప్రతి విద్యార్థికి రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. విద్యా రంగంలో స్థిరత్వం తీసుకొచ్చామని పేర్కొన్నారు.

పరిశ్రమలు, పెట్టుబడుల పునరాగమనం

గత పాలనలో రాష్ట్రాన్ని విడిచిపెట్టిన పరిశ్రమలను తిరిగి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మొత్తంగా సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తూ రాయలసీమ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ప్రాజెక్టుల పురోగతితో పాటు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ గుప్తా, జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి, ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారథి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, పత్తికొండ ఎమ్మెల్యే కే.ఈ. శ్యామ్ కుమార్, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.