31marcheditorial | ఉద్యమం క్షీణతకు కారణాలు..

31marcheditorial | ఉద్యమం క్షీణతకు కారణాలు..
31marcheditorial | మావోయిస్టుల లొంగిపోవడానికి కేంద్రం గడువు
నక్సల్బరీ నుంచి ప్రారంభమైన సాయుధ పోరాటం
బస్తర్ ప్రాంతానికి పరిమితమైన మావోయిస్టు ప్రభావం
లొంగిపోయే నక్సలైట్ల పెరుగుదల మరియు ప్రభుత్వ వ్యూహం
31marcheditorial | మావోయిస్టులు లొంగిపోవడానికి కేంద్రం విధించిన గడువు నేటితో తేదీతో ముగియనుంది. ఈ లోగానే ఈ లక్ష్యాన్ని దాదాపుగా సాధించామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. అయితే, దేశంలో దోపిడీ ఉన్నంత కాలం నక్సలిజం ఉంటుందని మావోయిస్టులు అంటున్నారు. 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ ప్రాంతంలో భూస్వాములు, వ్యవసాయ కూలీలకూ మధ్య ప్రారంభమైన ఘర్షణ సాయుధ పోరాటంగా మారింది. ఆతర్వాత ఎన్నో పేర్లతో సాయుధ పోరాటం కొనసాగుతూ చివరికి మావోయిస్టు పార్టీగా స్థిరపడింది. నక్సలైట్ ఉద్యమాన్ని అంతం చేస్తామని పూర్వపు ప్రభుత్వాలు కూడా ప్రకటనలు చేసినప్పటికీ, ఇప్పటి మాదిరిగా నిర్ణీత గడువు విధించలేదు. నక్సలైట్ ఉద్యమానికి ప్రారంభంలో ఉన్న ప్రాభవం, జనాదరణ ఇప్పుడు లేకపోవడం వల్ల అది క్షీణించింది. దేశ వ్యాప్తంగా 200 పైగా జిల్లాల్లో విస్తరించిన నక్సలైట్ ఉద్యమం ఇప్పుడు ఐదారు జిల్లాలకే పరిమితం అయిందని అమిత్ షా చెబుతున్నారు.
గతంలో వ్యవసాయ కూలీలను భూస్వాముల దోపిడీ నుంచి విముక్తం చేయడమే ఉద్యమ లక్ష్యంగా ఉండేది. ఇప్పుడు ఖనిజ సంపదను దోచుకుంటున్న విదేశీ పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లకు వ్యతిరేకంగా మావోయిస్టు నాయకులు పోరాటం సాగిస్తున్నారు. ఖనిజ సంపద ఎక్కువగా ఉన్న జార్ఖండ్, బస్తర్, చత్తీస్గఢ్ ప్రాంతాలకే పరిమితమై సాగుతూ వస్తోంది. ఇక్కడ కూడా ప్రజాప్రతినిధులకు తగిన రక్షణ కల్పించడం, గిరిజన నాయకులకు ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా ఉద్యమాన్ని చాలా వరకూ నిర్వీర్యం చేశారు. గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం వల్ల కూడా ఉద్యమ తీవ్రత తగ్గింది. ఇప్పుడు బస్తర్ ప్రాంతానికే పరిమితమైన ఈ ఉద్యమాన్ని పూర్తిగా అణచివేశామని అమిత్ షా చెబుతున్నారు. మావోయిస్టు పార్టీ అగ్ర నాయకుడు గణపతి అలియాస్ ముప్పాళ్ళ లక్ష్మణరావు మినహా చెప్పుకోదగిన అగ్రనాయకులు ఎవరూ లేరు. ఆయన అనారోగ్య కారణంగా క్రియాశీలంగా లేరు.

ఆయనను కూడా లొంగిపొమ్మనమనీ, ఆధునిక వైద్యం ఇప్పిస్తామని తెలంగాణా డీజీపీ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఎదురు కాల్పుల్లో మరణించినవారు కాకుండా, చాలా మంది నక్సలైట్లు లొంగిపోవడానికి ప్రభుత్వం ప్రకటించిన నగదు రివార్డు, ఇతర ప్రోత్సహకాలే కారణం. అంతే కాకుండా అనారోగ్యం వల్ల చాలా మంది లొంగిపోయారు. ఈ ఉద్యమంలో గతంలో మాదిరిగా పట్టు లేదు. పట్టుతప్పింది. ప్రభుత్వానికి ఏజెంట్లుగా, రహస్య సమాచారాన్ని అందించే కోవర్టులుగా పని చేసేవారు ఎక్కువ మంది తయారు కావడంతో లొంగిపోతేనే మంచిదన్న నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా లొంగిపోయిన వారు కూడా ఉన్నారు. ఏమైనా నక్సలైట్ ఉద్యమం ప్రారంభ దశలో ఉన్న సమస్యలు, పరిస్థితులు ఇప్పుడు లేనందున లొంగిపోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనిని అనువుగా తీసుకుని ప్రభుత్వం డెడ్లైన్ గడువు విధించింది. అది ఫలిస్తోంది.
