ఇంద్రకీలాద్రి పై ధ్వజారోహణం

ఇంద్రకీలాద్రి పై ధ్వజారోహణం..
చైత్ర బ్రహ్మోత్సవాలకు వైభవ ప్రారంభం
శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయంలో వేదఘోషల మధ్య పతాకారోహణం
స్థానాచార్య ఆధ్వర్యంలో వైదిక క్రతువులు…
ఈవో శీనా నాయక్ ప్రత్యేక పూజలు
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : ఇంద్రకీలాద్రిపై చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలకు శుభారంభం పలుకుతూ శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం 7 గంటలకు జరిగిన ఈ కార్యక్రమం వేద మంత్రోచ్చారణల నడుమ భక్తి పారవశ్యంతో సాగింది. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా వైదిక క్రతువులు నిర్వహించారు. అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించగా, దేవాలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాల ప్రారంభానికి సంకేతం పలికారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శీనా నాయక్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల విజయవంతానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. ధ్వజారోహణంతో ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు రాబోయే రోజుల్లో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో వైభవంగా కొనసాగనున్నాయి.

