in2states | బదిలీల కోసం ఎదురు చూపులు

in2states | బదిలీల కోసం ఎదురు చూపులు
in2states | డ్యూటీ- ఒక చోట… కుటుంబాలు వేరే చోట
ఉభయ రాష్ట్రాల్లోనూ ఇవే సమస్యలు
సొంత రాష్ట్రాలకు బదిలీ చేయాలని వినతులు
హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియమితులైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల స్థానికత కలిగిన హోంగార్డులు సొంత రాష్ట్రాలకు బదిలీ కాకపోవడంతో, పనిచేసే చోట నివాసం ఏర్పరుచుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. తెలంగాణ స్థానికత కలిగిన హోంగార్డులు ఆంధ్రప్రదేశ్‌లోనూ… ఆంధ్ర స్థానికత కలిగిన వారు తెలంగాణ రాష్ట్రంలోనూ విధులు నిర్వర్తిస్తున్నారు. స్థానికతకు ప్రాధాన్యం ఇస్తూ అర్హత కలిగిన వారికి కానిస్టేబుల్‌గా ప్రమోషన్లు ఇస్తున్నారని, అయితే స్థానికేతరులైన హోంగార్డులకు పదోన్నతులు లభించడం లేదని వారు చెబుతున్నారు.
హోంగార్డుల వర్గాల సమాచారం మేరకు, తెలంగాణలో సుమారు 200 మంది ఏపీకి చెందిన హోంగార్డులు ఉండగా, ఇదే విధంగా తెలంగాణకు చెందిన వారు ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. పని ఒకచోట, కుటుంబాలు మరొకచోట ఉండటం వల్ల డ్యూటీకి హాజరయ్యేందుకు రవాణా, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వారు పేర్కొంటున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవడం కష్టమవుతోందని, పిల్లల చదువులు, ఉద్యోగాల విషయంలో స్థానికత ప్రాముఖ్యత పెరగడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ విషయమై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వినతిపత్రాలు సమర్పించినట్లు కూడా వారు వెల్లడించారు.
in2states | పోలీసులతో సమానంగా విధులు
హోంగార్డులు ట్రాఫిక్, బందోబస్తు, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులతో పాటు సేవలు అందిస్తున్నప్పటికీ, తమకు తగిన వేతనం, ఉద్యోగ భద్రత, సదుపాయాలు అందడం లేదని వారు చెబుతున్నారు. సమాన పనికి సమాన వేతనం అమలు కావాలని కోరుతున్నారు. 30-35 సంవత్సరాల సేవ ఉన్నప్పటికీ తగిన స్థాయి ఉద్యోగ హోదాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం హోంగార్డులకు మరింత ప్రాధాన్యం కల్పించాలని వారు అభిప్రాయపడుతున్నారు.
వేతనం, భద్రత, సామాజిక భద్రత అంశాల్లో మరింత దృష్టి పెట్టాలని కోరుతూ, మానవతా దృక్పథంతో స్వరాష్ట్రాలకు బదిలీలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సమస్యపై భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
తల్లిదండ్రులను చూసుకోలేకపోతున్నా…

హైదరాబాద్ సిటీ-లో హోంగార్డ్ గా 20ఏళ్ల నుంచి పని చేసస్తున్నాను. మాది ఆంధ్రప్రదేశ్, మార్కాపురం జిల్లా… మా తల్లిదండ్రులు అక్కడే ఉంటారు. డ్యూటీ- హైదరాబాద్‌లో కావడంతో వారికి ఆరోగ్య సమస్యలొస్తే… వెళ్లి రావాలంటే వేలల్లో ఖర్చవుతుంది. మా పిల్లలకు చదువు, ఉద్యోగాల విషయంలోనూ స్థానికత పెద్ద సమస్యగా మారింది. మా బాధను అర్ధం చేసుకొని, మమ్మల్ని మా ప్రాంతానికి బదిలీ చేయాలి.
–ఎస్ వి వి ఎల్ లక్ష్మీనారాయణ రెడ్డి
స్థానికేతరులకు లభించని పదోన్నతి

విజయవాడలో ఇంటెలిజెన్స్ మెయిన్ ఆఫీస్‌లో పని చేస్తున్నాను… నాది 15 సంవత్సరాల సర్వీస్. మాది తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట. మా కుటు-ంబం అక్కడే ఉంది. వారికి దూరంగా ఉండి డ్యూటీ- ఎక్కడో చేయడం దురదృష్టంగా భావిస్తున్నా. ఆంధ్రలో ఎన్ని సంవత్సరాల సర్వీస్ చేసినా స్థానికత లేకపోవడంతో కానిస్టేబుల్ గా ప్రమోషన్ మాత్రం రావట్లేదు. చాలీచాలని జీతంలో నెట్టు-కురావడం చాలా కష్టంగా మారింది. మాకు తెలంగాణకు ట్రాన్స్ ఫర్ చెయ్యండి.
-షేక్ ఆరిఫ్
వారం వారం విజయవాడ వెళ్తా…
మాది హైదరాబాద్ నగరం ముషీరాబాద్. డ్యూటీ- విజయవాడలో. మా ఫ్యామిలీ అంతా హైదరాబాద్‌లోనే ఉంది. వారం వారం వెళ్లి వస్తుంటాను. ఏడు సంవత్సరాలుగా జీతాలు కూడా పెంచుతలేరు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆలోచించి, మాకు న్యాయం చేయాలి.
-సంధ్యారాణి
12 ఏళ్లుగా ఎదురు చూపులు

మాది ఆంద్ర గుంటూరు. 16 సంవత్సరాలుగా హైదరాబాద్ సిటీ-లోనే పని చేస్తున్నాను. రాష్ట్ర విభజన తర్వాత మా ప్రాంతానికి ట్రాన్స్ ఫర్ చేస్తారని అనుకున్నాము. కానీ చెయ్యలేదు. కుటు-ంబాన్ని వదిలి ఉంటు-న్నాము. దయచేసి మా బాధలు పట్టించుకొని మాకు న్యాయం చేయండి.
-లాజర్


