ఫెర్రర్ కుటుంబంతో పరిటాల కుటుంబం ఆత్మీయ కలయిక…

ఫెర్రర్ కుటుంబంతో పరిటాల కుటుంబం ఆత్మీయ కలయిక…
రాప్తాడు, ఆంధ్రప్రభ : సంతోషం ఉద్వేగభరితమైన వాతావరణంలో ఆర్డీటీ వ్యవస్థాపకులైన ఫెర్రర్ కుటుంబంతో పరిటాల కుటుంబసభ్యులు ఆత్మీయంగా కలిశారు. కేంద్ర ప్రభుత్వం ఆర్డీటీకి ఎఫ్.సి.ఆర్.ఏ రెన్యూవల్ కు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ లు ఫెర్రర్ కుటుంబాన్ని కలిశారు. అనంతపురంలోని వాళ్ల నివాసానికి వెళ్లగా అన్నే ఫెర్రర్ తో పాటు విశాల ఫెర్రర్ వాళ్ళని ఆహ్వానించి మర్యాదపూర్వకంగా భేటి అయ్యారు. ఎమ్మెల్యే సునీతను అన్నే ఫెర్రర్ విశాల ఫెర్రర్ ఆలింగనం చేసుకుని తమ సంతోషాన్ని పంచుకున్నారు.
గత కొన్ని రోజులుగా ఆర్డీటీకి ఎఫ్.సి.ఆర్.ఏ రెన్యూవల్ ఆగిపోవడంతో సేవా కార్యక్రమాలకు ఇబ్బందులు తలెత్తుతాయన్న ఆందోళన అందరిలో నెలకొంది. దాదాపు ఐదున్నర దశాబ్ధాలుగా జిల్లాతో అవినాభావ సంబంధం కల్గిన అన్నేఫెర్రర్ కూడా ఈ విషయంలో ఆందోళన చెందారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్యే సునీత శ్రీరామ్ తో పాటు జిల్లాలోని కూటమి ప్రజాప్రతినిధులు అంతా ఢిల్లీ స్థాయిలో చేసిన కృషి ఫలితంగా ఆర్డీటీకి ఎఫ్.సి.ఆర్.ఏ రెన్యూవల్ కు గ్రీన్ సిగ్నల్ లభించింది.

ఈ ఆనందాన్ని ఫెర్రర్ కుటుంబంతో పంచుకున్నారు. గత ఏడాదిగా జరిగిన పరిణామాలన్నింటినీ చర్చించుకున్నారు. ఈ సంధర్భంలో అన్నేఫెర్రర్ కొంత ఉద్వేగానికి గురయ్యారు. ఈ జిల్లా తమ కుటుంబం లాంటిదని ఇక్కడ సేవా కార్యక్రమాలు ఎప్పటికీ నిరాటంకంగా కొనసాగించాలన్నది ఫాదర్ ఫెర్రర్ ఆశయమని అన్నారు. అనంతరం ఇరువురికి ఎమ్మెల్యే సునీత శ్రీరామ్ సన్మానం చేశారు.
ప్రధాని మోదీతో పాటు హోం మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆర్డీటీ సేవల్ని మరింత విస్తృతం చేసే దిశగా ఇక నుంచి అడుగులు పడాలని ఆకాంక్షించారు.
