విజిలెన్స్ అధికారులు ముమ్మర తనిఖీలు

విజిలెన్స్ అధికారులు ముమ్మర తనిఖీలు

అక్రమంగా నిల్వ ఉంచిన 40 సిలిండర్ల సీజ్
గ్యాస్ బాటిలింగ్ యూనిట్ కూడా గ్యాస్ కొరత
కమర్షియల్ సిలిండర్లకు ఫుల్ డిమాండ్

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : అమెరికా, ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ స్థాయిలో ఇంధన డిమాండ్ పెరగడం, సరఫరాలో అంతరాయం కలగడం వల్ల చిత్తూరు జిల్లాలో గ్యాస్ కొరత తీవ్ర రూపం దాల్చుతోంది. గృహ వినియోగదారులు నుంచి వ్యాపారుల వరకు అందరూ గ్యాస్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితి మరింత విషమించకుండా నియంత్రించేందుకు విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. జిల్లా వ్యాప్తంగా దాడులను ముమ్మరం చేశారు 40 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.

విజిలెన్స్ దాడులను నిరంతరం నిర్వహించాలని నిర్ణయించారు. పూతలపట్టు మండలంలో ఉన్న గ్యాస్ బాట్లింగ్ యూనిట్ కూడా గ్యాస్ డిమాండ్ ఏర్పడింది. రెండు రోజులకు అవసరమయ్యే గ్యాస్ నిల్వలు మాత్రమే బాట్లింగ్ యూనిట్లో ఉన్నాయి. ఈలోపు గ్యాస్ నిల్వలు రాకపోతే మూతపడే ప్రమాదం ఉంది. అదే జరిగితే చిత్తూరు జిల్లాలో గ్యాస్ సరఫరా అస్తవ్యస్తంగా తయారయ్యే ప్రమాదం ఉంది. జిల్లా వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వ, మళ్లింపు, దుర్వినియోగం వంటి అంశాలపై విజిలెన్స్ అధికారులు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

తిరుపతికి చెందిన విజిలెన్స్ బృందాలు చిత్తూరు, నగరి, గుడిపాల, కుప్పం, పలమనేరు, బైరెడ్డిపల్లి మండలాల్లో ఆకస్మిక దాడులు చేపట్టి ఇప్పటివరకు సుమారు 40 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలు మరికొన్ని రోజులు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక స్వివిక్ సప్లై శాఖ అధికారులు కూడా గ్యాస్ డీలర్ల వ్యవహారాలపై దృష్టి సారించారు. జిల్లాలోని తహసీల్దారులు గ్యాస్ గోదాములను తనిఖీ చేస్తూ రికార్డులను పరిశీలిస్తున్నారు.

గ్యాస్ పంపిణీ కేంద్రాల్లో వినియోగదారులకు సరఫరా సక్రమంగా జరుగుతుందా లేదా అన్నదానిపై కఠినంగా పర్యవేక్షణ కొనసాగుతోంది. అయితే నేలస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో గ్యాస్ బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇది 25 రోజుల నుంచి 45 రోజులకు పెరగడం వినియోగదారుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. 45 రోజులు గ్యాస్ సిలిండర్ ఎలా సరిపెట్టుకోవాలన్న ప్రశ్నతో గ్రామీణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

గ్యాస్ అయిపోతే ఏం చేయాలన్న సందిగ్ధంలో కొందరు మళ్లీ కట్టెల పొయ్యిలను సిద్ధం చేసుకుంటుండగా, మరికొందరు బయోగ్యాస్ ప్లాంట్లను మరమ్మతు చేసి వినియోగానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. గ్యాస్ బుకింగ్ కోసం ఒకేసారి భారీగా వినియోగదారులు ప్రయత్నించడం వల్ల సర్వర్ సమస్యలు తలెత్తుతున్నాయి. బుకింగ్ చేసినప్పటికీ సరఫరా ఆలస్యం కావడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

గ్యాస్ వస్తుందో లేదో అనే అనిశ్చితి ప్రజల్లో మరింత భయాందోళనలను పెంచుతోంది. పూతలపట్టు మండలం ఎర్రచెరువు పల్లెలో మూడు నెలల క్రితం ప్రారంభించిన గ్యాస్ బాటిలింగ్ యూనిట్ పరిస్థితి కూడా దయనీయంగా మారింది. ఈ యూనిట్‌లో ప్రస్తుతం రెండు రోజులకే సరిపడా గ్యాస్ నిల్వలు మాత్రమే ఉన్నాయి. సమయానికి గ్యాస్ సరఫరా జరగకపోతే యూనిట్ మూతపడే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ యూనిట్ ద్వారా రోజుకు 18 నుంచి 20 వేల సిలిండర్లను గ్రామీణ ప్రాంతాలకు పంపిణీ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ, సరఫరా లోపంతో ప్రస్తుతం పరిమిత స్థాయిలోనే పంపిణీ జరుగుతోంది. ఇటీవల ఒక రోజులో కేవలం కొన్ని వందల సిలిండర్లు మాత్రమే పంపిణీ చేయగలిగారు. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. హోటళ్లు, మెస్సులు, పీజీలు, టిఫిన్ సెంటర్లు, బజ్జీలు, బోండాలు, పానీపూరి దుకాణాలు వంటి చిన్న వ్యాపారాలన్నీ కమర్షియల్ గ్యాస్‌పై ఆధారపడుతున్నాయి.

అయితే ప్రభుత్వం గృహ వినియోగ గ్యాస్‌కు ప్రాధాన్యత ఇస్తుండటంతో కమర్షియల్ సిలిండర్ల సరఫరా తగ్గిపోయింది. డిమాండ్‌కు సరిపడా సిలిండర్లు అందకపోవడంతో వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరికి ఒకటి లేదా రెండు సిలిండర్లు మాత్రమే ఇవ్వడం వల్ల వారి వ్యాపారాలు నిలిచిపోతున్నాయి. మొత్తంగా చూస్తే, గ్యాస్ కొరత సమస్య చిత్తూరు జిల్లాలో తీవ్రంగా ప్రభావం చూపుతోంది.

ఒకవైపు అధికారులు అక్రమాలపై చర్యలు తీసుకుంటుండగా, మరోవైపు సరఫరా లోపం కారణంగా ప్రజలు, వ్యాపారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితి త్వరగా సాధారణ స్థితికి చేరకపోతే మరింత సంక్షోభం తలెత్తే అవకాశముందని భావిస్తున్నారు.

Leave a Reply