పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం…

పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం…

నరసరావుపేట, ఆంధ్రప్రభ : ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం చూపడమే లక్ష్యంగా పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హాతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు పట్టణంలోని పలు ప్రాంతాలలో మంగళవారం విస్తృతంగా పర్యటించారు.. 5, 6, 7 వార్డులకు చెందిన ఈ కాలనీలో పర్యటించి, అక్కడ నివసిస్తున్న సుమారు 360 ఇళ్ల ప్రజలకు పొజిషన్ పట్టాలు ఇచ్చే అంశంపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.

ఎస్.ఆర్.కె.టి కాలనీలోని 18వ లైన్ సమీపంలో నివసిస్తున్న నిరుపేదలకు పట్టాలు ఇచ్చే ప్రక్రియను ఎమ్మెల్యే స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ “గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన రెవెన్యూ సమస్యలను ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తున్నాం. పేద ప్రజల సొంతింటి కలను నిజం చేయడమే మా ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే విన్నపంపై స్పందించిన జేసీ, అర్హులైన వారందరికీ త్వరలోనే పట్టాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ పర్యటనలో కూటమి నాయకులు, రెవెన్యూ అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.