బడ్జెట్ అంతా డోల్ల..

బడ్జెట్ అంతా డోల్ల..

  • హామీలకు నిధులు ఎక్కడ?
  • ఆరు గ్యారెంటీల అమలుపై చిత్తశుద్ధి చూపాలి
  • మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి

ఆంధ్రప్రభ ప్రతినిధి , భూపాలపల్లి : ప్రజల ఆశలను తుంచేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ పూర్తిగా డోల్ల గా మారిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఘాటుగా విమర్శించారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను నమ్మబలికి, అమలులో మాత్రం పూర్తిగా వెనక్కి తగ్గిన ప్రభుత్వ వైఖరి ఈ బడ్జెట్‌లో స్పష్టంగా బయటపడిందన్నారు.

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి, పట్టణ బిఆర్ఎస్ పార్టీ నాయకులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఈ బడ్జెట్‌తో సబ్బండ వర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆశలను నిలబెట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

ప్రతి బడ్జెట్‌పై ప్రజలు ఎంతో ఆశలు పెట్టుకుంటారని, గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేసి రైతుబంధు వంటి పథకాల ద్వారా రైతులకు మద్దతు అందించారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చి, వాటి అమలులో విఫలమైందని విమర్శించారు. ఎన్నికల ముందు 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని, చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పక్కనబెట్టిందన్నారు.

ఇప్పటికే మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా, హామీల అమలులో పురోగతి కనిపించడం లేదని పేర్కొన్నారు. తాజా బడ్జెట్‌లో పథకాలపై కేటాయింపులు తగ్గడం ఆందోళన కలిగించే అంశమని, ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి తగిన నిధులు కేటాయించలేదని అన్నారు. ఎన్నికల సమయంలో ఇళ్లు ఇస్తామని ఇచ్చిన హామీలు నెరవేరే పరిస్థితి కనిపించడం లేదన్నారు. రైతుబంధు అమలు కూడా ఆలస్యమవుతోందని, గతంలో రైతులకు సకాలంలో సాయం అందేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం దురదృష్టకరమని విమర్శించారు.

మహిళలకు ఇచ్చిన హామీలపైనా ప్రభుత్వం వెనుకంజ వేసిందని, మహాలక్ష్మీ పథకం కింద రూ.2500 ఆర్థిక సహాయం, తులం బంగారం, ఆడపిల్లలకు స్కూటీలు వంటి హామీలు బడ్జెట్‌లో కనిపించలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బడ్జెట్‌లో మార్పులు చేసి, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీల అమలు ద్వారా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply