ఎర్రకట్ట స్పీడ్ బ్రేకర్ల పై జీబ్రా లైన్స్…… ఏవి?

ఎర్రకట్ట స్పీడ్ బ్రేకర్ల పై జీబ్రా లైన్స్…… ఏవి?

1.2 కిలో మీటర్ రోడ్డులో 9 స్పీడ్ బ్రేకర్లు
కొత్తగా వేసిన ఎర్రకట్ట రోడ్డుపై రేడియం ఇండికేటర్స్..ఎక్కడ?
ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే నాధుడు లేడు..

చిట్టినగర్, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజక వర్గం వన్ టౌన్ నుండి సెంట్రల్ నియోజకవర్గ టూ టౌన్ ను కలిపే అతి ప్రధానమైన రోడ్డు ఎర్రకట్ట. నిత్యం వాహనాల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉండే రోడ్డు ఎర్రకట్ట రోడ్డు. ఇటీవలే ఆర్ అండ్ బి వారు గుంతలు పడిన ఎర్రకట్ట రోడ్డు 1.2 కిలో మీటర్ కొత్త గా తారు రోడ్డు వేశారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కేవలం 1.2 కిలో మీటర్ రోడ్డు మీద 9 స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. ఇన్ని స్పీడ్ బ్రేకర్లు ఉండటానికి ఇక్కడ ఏమైనా పాఠశాలలు ప్రార్ధన మందిరాలు ఉన్నాయా అంటే ఏవి ఏం లేవు, కేవలం ఒక నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల, ఒక చర్చి మాత్రమే ఉన్నాయి.

గతంలో ఉన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎర్రకట్ట రోడ్డు పై ప్రత్యేక శ్రద్ధ తో 7 స్పీడ్ బ్రేకర్లు వేయించారు. ఇటీవల కొత్తగా రోడ్డు వేసిన తర్వాత కీలక ప్రాంతాల్లో మరో రెండు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. ఈ రోడ్డు పై ఇన్ని స్పీడ్ బ్రేకర్లు అవసరమా అని ప్రయాణీకులు స్థానికులు అనుకుంటున్నారు. ఎర్రకట్ట రోడ్డు పై ఉన్న స్పీడ్ బ్రేకర్లు పై జీబ్రా లైన్స్ ఎక్కడా కూడా కనబడవు.

ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు పై జీబ్రా లైన్స్ లేక పోవడంతో ద్విచక్ర వాహనదారులు ఆటోలు, కార్లు లో ప్రయాణించే ప్రయాణికులకు ఏది స్పీడ్ బ్రేకరో, ఏది రోడ్డు అని గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో రాత్రి పూట, వెలుతురు సరిగ్గా లేని సమయంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కొత్తగా రోడ్డు వేసిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో రేడియం ఇండికేటర్ లను ఏర్పాటు చేసే నిమిత్తం రోడ్డు పై రంధ్రాలు చేశారు, కానీ రేడియం ఇండికేటర్ బిగించకుండా వదిలి వేశారు.

వన్ టౌన్ ను టూ టౌన్ కలిపే వాహనాల రాకపోకలతో నిత్యం అత్యంత రద్దీగా ఉండే అతి ప్రధానమైన రోడ్డు అయిన ఎర్రకట్ట పై ఉన్న స్పీడ్ బ్రేకర్లు పై జీబ్రా లైన్స్ ఏర్పాటు చేయమని, రేడియం ఇండికేటర్ కోసం చేసిన రంధ్రాలలో రేడియం ఇండికేటర్ బిగించమని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply