ఇంజినీరింగ్ రంగంలో నల్లమల వాసికి విశిష్ట సేవలు
ఇంజినీరింగ్ రంగంలో నల్లమల వాసికి విశిష్ట సేవలు
- ఇంజినీర్-ఇన్-చీఫ్ గణపతి రెడ్డికి విశిష్ట సేవల పురస్కారం
- భారత మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ చే ఉగాది పురస్కార అవార్డు ప్రధానం
అచ్చంపేట, ఆంధ్రప్రభ ; కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ప్రతిభావంతుడైన ఇంజినీర్-ఇన్-చీఫ్ ఐ. గణపతి రెడ్డి కి ఇంజనీరింగ్ సంఘంలో అందించిన విశిష్ట సేవలకు గాను ప్రతిష్టాత్మక పురస్కారాన్ని 48వ భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి గౌరవ నూతలపాటి వెంకట రమణ గారి చేతుల మీదుగా ప్రదానం చేశారు. కిన్నెర కల్చరల్ & ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తరఫున “శ్రీ పరాభవ నామ ఉగాది పురస్కారం”తో పాటు “రావు సాహెబ్ శ్రీ భావరాజు సత్యనారాయణ స్మారక పురస్కారం”ను ఘనంగా అందజేశారు.
ఈ సందర్భంగా సభాధ్యక్షులు రమణాచార్యులు, నిర్వాహకులు మాట్లాడుతూ, అవిభక్త మద్రాసు రాష్ట్రంలో రహదారులు, ఆనకట్టలు, వంతెనల నిర్మాణంలో విశేష సేవలు అందించిన భావరాజు సత్యనారాయణ గారి స్ఫూర్తితో ఈ పురస్కారాలను అందిస్తున్నామని తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా, వంగూరు మండలం, దిండి చింతపల్లి గ్రామానికి చెందిన గణపతి రెడ్డి 1959లో జన్మించారు. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసి, 1982లో ప్రభుత్వ సేవలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా చేరారు.
అనంతరం యూపీఎస్సీ ద్వారా ఇండియన్ పోలీస్ సర్వీసుకు ఎంపికై పాండిచేరి కేడర్‌కు కేటాయించబడ్డారు. దీర్ఘకాలంగా రోడ్లు, భవనాల శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన, ఇంజినీర్-ఇన్-చీఫ్‌గా విశిష్ట సేవలు అందించారు. 2024లో ఆ పదవికి రాజీనామా చేసిన అనంతరం, తెలంగాణ ప్రభుత్వం విద్యా, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. గణపతి రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ, రాష్ట్ర రహదారుల విస్తరణ, గోదావరి నదిపై ప్రధాన వంతెనలు, తెలంగాణ సచివాలయం, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, యాదాద్రి ఆలయ అభివృద్ధి వంటి అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు పూర్తయ్యాయి.
అలాగే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, మెడికల్, నర్సింగ్ కళాశాలల నిర్మాణంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యంగ్ ఇండియా సమీకృత పాఠశాలల నిర్మాణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దాదాపు 46 సంవత్సరాలుగా ప్రభుత్వ రంగానికి విశిష్ట సేవలు అందిస్తున్న ఆయనకు ఈ పురస్కారాలు లభించడం గర్వకారణమని పలువురు అభిప్రాయపడ్డారు. తన పదవి కాలంలో అత్యంత క్లిష్టమైన పనులలో సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, తోటి సహచరులు, మిత్రులకు, తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అవార్డు గ్రహీత ఇంజినీర్-ఇన్-చీఫ్ గణపతి రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు డా. ఆర్. ప్రభాకరరావు, కార్యదర్శి మద్దాళి రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.
