60% to 90% | అది ప్రాణాంతకం..

60% to 90% | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పారా క్వాట్ గడ్డి నివారణ మందు దేశంలో అన్నదాతల ఆయువును తీస్తోంది. దీంతో ఈ మందును నిషేధించాలని దేశ పార్లమెంట్‌లో చర్చలు జరిగాయి. బీఆర్ఎస్ నేత సురేష్ రెడ్డి దేశవ్యాప్తంగా పారా క్వాట్ నిషేధించాలని కోరారు. మరికొన్ని రాష్ట్రాలు పూర్తిగా బ్యాన్ చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతున్నాయి. వైద్యులు, నిపుణులు, సామాజిక సంస్థలు ఈ విషమందుపై వెంటనే నిషేధం విధించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

ప్రస్తుతం ఈ పురుగుమందు తక్కువ ఖర్చు, తక్షణ ఫలితాలు ఇవ్వడం ఈ మందు స్వభావం. రైతులు పంటల్లో కలుపు మొక్కలను వేగంగా తొలగించేందుకు ఈ మందును విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇదే మందు ఇప్పుడు ప్రాణాంతకంగా మారి ప్రజల ప్రాణాలను బలిగొడుతోందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి.
60% to 90% | పారా క్వాట్ మందు ఎంత ప్రమాదకరం.. వైద్యులు ఏం అంటున్నారు..?

వైద్యుల సూచనల ప్రకారం.. పారా క్వాట్ కేవలం 10 మిల్లీలీటర్ల మోతాదు కూడా ప్రాణాంతకమవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇది శరీరంలోకి వెళ్లిన వెంటనే ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిని పల్మనరీ ఫైబ్రోసిస్‌కు దారితీస్తుంది. అలాగే కాలేయం, కిడ్నీలు పనితీరు దెబ్బతింటాయి. అయితే ఈ గడ్డి మందు విషానికి ఎలాంటి ప్రత్యేక విరుగుడు (అంటీడోట్) లేదని, అందువల్ల చికిత్స కష్టసాధ్యమవుతోందని వైద్యులు వెల్లడిస్తున్నారు.
అందుకే దీనివల్ల మరణాల శాతం 60% నుంచి 90% వరకు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీర్ఘకాలికంగా ఈ మందు వాడకం నరాల సంబంధిత వ్యాధులు, ముఖ్యంగా పార్కిన్సన్స్ వ్యాధికి కారణమయ్యే అవకాశముందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందుకే అంతర్జాతీయ స్థాయిలో దీనిపై కఠిన చర్యలు తీసుకున్నారు.
పారా క్వాట్ మందు వాడకం వల్ల తెలంగాణలో ప్రతి సంవత్సరం సుమారు వందల మంది మృతువాత పడుతున్నారని నివేదికలు వెల్లడించాయి. ముఖ్యంగా చైనాలో సంవత్సరానికి 5000 మందికి పైగా మరణాలు ఈ మందుతో సంభవించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఆత్మహత్యలలో కూడా ఈ మందు వినియోగం అధిక శాతం ఉండటం మరో ఆందోళనకర అంశం. దీంతో యూరప్, చైనా, బ్రెజిల్ వంటి 70కి పైగా దేశాలు పారా క్వాట్‌ను పూర్తిగా నిషేధించాయి.
