రేపటి నుంచే “రైతన్నా …మీకోసం”

తిరువూరు, ఆధ్రప్రభ ; వచ్చే ఖరీఫ్ సీజన్ లో సాగు విధానాలపై ముందుగానే రైతులకు అవగాహన కల్పించేందుకు ఈనెల 16 నుంచి పది రోజులపాటు ప్రభుత్వం “రైతన్నా …మీకోసం” అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించనున్నదని తిరువూరు ఇన్చార్జి ఏడీఏ పీ పద్మ తెలిపారు. ప్రకృతి వ్యవసాయం, వాతావరణ హెచ్చరికలు, ఎల్నినో ప్రభావం పై ముందస్తు సమాచారం అందించే అంశాలపై రైతాంగానికి సమగ్రంగా అవగాహన కల్పించడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పద్మ పేర్కొన్నారు.

ఆయా రైతు సేవా కేంద్రం పరిధిలోని వ్యవసాయ అనుబంధ శాఖల సిబ్బంది, సహకార, నీటి సంఘాల సభ్యులతో కలిసి నిర్దిష్ట కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలియజేశారు. ఈ సదస్సులలో 32 రకాల విత్తనాలతో పశుగ్రాసం సాగు చేయడం ద్వారా భూమిలో సేంద్రీయ కర్బనం నిల్వలు పెంచే విధానాలను వివరిస్తామని, ఈనెల 25న ముగింపు కార్యక్రమం జరుగుతుందని పద్మ వెల్లడించారు. రైతు సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నాణ్యమైన పంట దిగుబడులు సాధించాలని కోరారు.