సమాధానం చెప్పే నాయకత్వమే ప్రజాస్వామ్యానికి బలం
సమాధానం చెప్పే నాయకత్వమే ప్రజాస్వామ్యానికి బలం
ప్రజాస్వామ్యంలో పారదర్శకత, బాధ్యత అవసరం
కాంగ్రెస్ నేత వల్లూరు భార్గవ్
విజయవాడ, ఆంధ్రప్రభ : ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా కొనసాగాలంటే నాయకత్వం ప్రజలకు, పార్లమెంట్‌కు మీడియాకు బాధ్యతాయుతంగా సమాధానం చెప్పే విధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ ఇన్చార్జి వల్లూరు భార్గవ్ అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు కాపాడబడాలంటే ప్రశ్నలకు సమాధానం చెప్పే పారదర్శక పాలన అవసరమన్నారు. ఆదివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ, ఒక బలమైన దేశానికి ప్రజల ముందుకు వచ్చి వారి ప్రశ్నలకు సమాధానం చెప్పే నాయకత్వం అవసరమని చెప్పారు.
ప్రజాస్వామ్యం నిశ్శబ్దం, ప్రచార యంత్రాంగం లేదా నియంత్రిత కథనాలపై ఆధారపడలేదని అభిప్రాయపడ్డారు. దేశ నాయకత్వం పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొని ప్రజల సమస్యలపై చర్చించడంతో పాటు మీడియా ముందుకు వచ్చి ప్రజల సందేహాలకు సమాధానం ఇవ్వడం ప్రజాస్వామ్య బాధ్యతలో భాగమని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతమైన పాలన లేకపోతే ప్రజల నమ్మకం దెబ్బతింటుందని అన్నారు.
దేశ ప్రజలు ఎదుర్కొన్న పలు కీలక సంఘటనలను గుర్తు చేస్తూ ఆయన మాట్లాడుతూ, 2016 ఇండియన్ డెమోనేటి్సేషన్ సమయంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. అలాగే కోవిడ్ మహమ్మారి సమయంలో ఆక్సిజన్ కొరత కారణంగా అనేక కుటుంబాలు తీవ్ర బాధను అనుభవించాయని పేర్కొన్నారు. అదనంగా పెరుగుతున్న గ్యాస్, ఇంధన ధరలు సాధారణ కుటుంబాలపై భారంగా మారాయని అన్నారు.
దేశ ప్రజాస్వామ్యం ఏ వ్యక్తికైనా, ఏ రాజకీయ పార్టీకి అయినా మించి ఉన్న గొప్ప వ్యవస్థ అని వల్లూరు భార్గవ్ అన్నారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పే పాలన కొనసాగితేనే ప్రజాస్వామ్యం బలంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, గౌరవం కాపాడాలంటే నాయకులు పార్లమెంట్‌ను గౌరవిస్తూ ప్రజల పట్ల జవాబుదారీతనం పాటించాలని సూచించారు. ప్రజల ప్రశ్నలను అణచివేసే పరిస్థితి ఎప్పటికీ దేశంలో ఏర్పడకూడదన్నారు.
