అక్రమ ఇసుక రవాణా కేసులో ఆరుగురికి జరిమానా

అక్రమ ఇసుక రవాణా కేసులో ఆరుగురికి జరిమానా
మొబైల్ కోర్టు ఆదేశాలతో కమ్యూనిటీ సర్వీస్ శిక్ష
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : అక్రమంగా ఇసుక తరలించిన కేసులో ఆరుగురు ముద్దాయిలకు జరిమానాతో పాటు కమ్యూనిటీ సర్వీస్ శిక్ష విధిస్తూ ప్రత్యేక మొబైల్ కోర్టు తీర్పు ఇచ్చింది. హంద్రీ నది పరిసర ప్రాంతాల్లో అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరచగా ఈ తీర్పు వెలువడింది. పోలీసుల వివరాల ప్రకారం, కోడుమూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గోరంట్ల గ్రామం హంద్రీనది నుంచి ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించగా కొందరు వ్యక్తులు అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు.
ఈ ఘటనపై ఎస్‌ఐ స్వామి కేసు నమోదు చేసి ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసును విచారణకు ప్రత్యేక మొబైల్ కోర్టు ముందు ఉంచారు. విచారణలో నిందితులు తమ తప్పును అంగీకరించిన నేపథ్యంలో కోర్టు ఒక్కొక్కరికి రూ.300 చొప్పున జరిమానా విధించింది.అదనంగా సామాజిక బాధ్యతను గుర్తుచేస్తూ కోర్టు పరిసరాలను శుభ్రపరిచే విధంగా కమ్యూనిటీ సర్వీస్ శిక్షను కూడా విధించింది. అక్రమ ఇసుక రవాణా పర్యావరణానికి నష్టం కలిగించే చర్యగా భావిస్తూ ఇటువంటి కేసుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
హంద్రీ నది పరిసర ప్రాంతాల్లో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
