నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి

నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి

  • నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
  • రహదారి నిర్మాణంలో నాణ్యత లోపాలపై ఆగ్రహం
  • గుత్తేదారుల బిల్లులు పెండింగ్లో పెట్టుకోవద్దు.

కర్నూల్ కార్పొరేషన్, ఆంధ్రప్రభ : నగరంలో రహదారులు, డ్రైనేజీ కాలువలు వంటి మౌలిక సదుపాయాల పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, లేనిపక్షంలో సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ హెచ్చరించారు. శనివారం ఆయన చెక్‌పోస్ట్ సమీపంలో నందికొట్కూరు రహదారి నుండి నంద్యాల రహదారికి అనుసంధాన బి.టి. రహదారిని పరిశీలించారు.

రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన రహదారిలో తుది దశ పనులు సక్రమంగా చేయకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. గుత్తేదారుల బిల్లులు అధికారులు ముందుకు పంపకుండా తమ వద్దే రెండు నెలలుగా పెండింగ్‌లో ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీబీకి వాహనానికి లాగ్ బుక్ నిర్వహించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంధన వినియోగంపై పక్కా లెక్క పత్రాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. రహదారి కొలతలు పట్టి విస్తీర్ణాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రహదారి నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. పనుల తుది దశలో నిర్లక్ష్యం చేయడం వల్ల రహదారుల నాణ్యత దెబ్బతింటుందని, ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. గుత్తేదారులు పనులను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని, నాణ్యత లోపాలు ఉంటే తక్షణమే సరిదిద్దాలని ఆదేశించారు. ప్రజాధనాన్ని సమర్థవంతంగా వినియోగించాలని, ఇష్టానుసారం వ్యవహరిస్తే సహించబోమని కమిషనర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో డిఈఈ నరేష్, ఏఈ జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply