మైనార్టీలకు బొండా ఉమా ‘రంజాన్ తోఫా’

మైనార్టీలకు బొండా ఉమా ‘రంజాన్ తోఫా’
రంజాన్ సందర్భంగా పంపిణీ..
సొంత నిధులతో 1000 కుటుంబాలకు సహాయం, నియోజకవర్గంలో 15 వేల కుటుంబాలకు పంపిణీ
పాయకాపురం, ఆంధ్రప్రభ : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు మైనార్టీ కుటుంబాలకు రంజాన్ తోఫాలను అందజేశారు. శనివారం ఉదయం విజయవాడలోని 64వ డివిజన్ కండ్రిక ప్రాంతంలోని మజీది హబీబీ వెనుక గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 1000 మైనార్టీ కుటుంబాలకు తన సొంత నిధులతో రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో రంజాన్ మాసాన్ని ఆచరిస్తారని తెలిపారు. కఠోర ఉపవాస దీక్షలతో అల్లాహ్‌ను ప్రార్థిస్తూ దేశం, రాష్ట్రం, ప్రపంచం సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటారని చెప్పారు.
సెంట్రల్ నియోజకవర్గంలో మైనార్టీ సంక్షేమానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఏలూరు రోడ్డులోని కబరస్తాన్ అభివృద్ధికి సుమారు రూ.1.30 కోట్లు, బందర్ లాకుల సమీపంలోని కబరస్తాన్ అభివృద్ధికి రూ.70 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు. అలాగే సింగ్‌నగర్, పాయకాపురం ప్రాంతాల్లో మైనార్టీ అవసరాల కోసం రూ.40 లక్షలకు పైగా నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. మసీదుల నిర్మాణానికి అవసరమైన స్థలాలు అందజేయడంతో పాటు మదర్సాల ఏర్పాటుకు కూడా సహకారం అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

మైనార్టీ సమాజ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని 15 వేలకుపైగా మైనార్టీ కుటుంబాలకు తమ సొంత ఖర్చులతో రంజాన్ తోఫాలను పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి డివిజన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. రాబోయే ఆరు రోజుల్లో ప్రతిరోజూ రెండు డివిజన్లలో ఈ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మసీదుల్లో సేవలు అందిస్తున్న ఇమామ్‌లు, మౌజన్లకు జీతాలు కూడా అందజేసినట్లు తెలిపారు. అల్లాహ్ ఆశీస్సులతో అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ముస్లిం సోదరులకు ముందస్తుగా ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కాకొల్లు రవికుమార్, సెంట్రల్ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్‌కే గౌస్ బాషా, కాకొల్లు హర్ష సాయి, ప్రధాన కార్యదర్శి ఎస్‌కే బాబు, యూనిట్ ఇన్‌చార్జ్ కొమరి రాజేష్, సీనియర్ నాయకులు కంకణాల బాబు, కోరాడ రమణ, పొట్లూరు అప్పలనాయుడు తిరుపతయ్య, నల్లిపోగు కన్నా, అడపా సాయి, హుస్సేన్, పరిమి వెంకట్, ఫర్మీ అజయ్, తోటకూర రమేష్ బాబు, మాకం సుందరరావు తదితరులు పాల్గొన్నారు.


