డొమెస్టిక్ గ్యాస్ కొరతపై అపోహలు వద్దు

డొమెస్టిక్ గ్యాస్ కొరతపై అపోహలు వద్దు

వినియోగదారుల రక్షణ చట్టం అమలుపై అవగాహన పెంచాలి

కర్నూలు, ఆంధ్రప్రభ : గృహ అవసరాల (డొమెస్టిక్) గ్యాస్ వినియోగదారులు గ్యాస్ కొరతపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని జిల్లా జాయింట్ కలెక్టర్ నూర్ కమాల్ తెలిపారు. జిల్లాలో గ్యాస్ సరఫరా సమృద్ధిగా ఉందని, వినియోగదారులు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.


శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జాయింట్ కలెక్టర్, గ్యాస్ ప్లాంట్లలో సాధారణంగా మూడు నుంచి ఆరు రోజులకు సరిపడా ఎల్‌పీజీ నిల్వలు నిరంతరం అందుబాటులో ఉంటాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ సంస్థల కోసం కొన్ని నిబంధనలు, రేషనింగ్ విధానాలను అమలు చేస్తున్నప్పటికీ గృహ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు.


ఆసుపత్రులు, హాస్టళ్లు, జైళ్లు వంటి అత్యవసర సేవలకు గ్యాస్ సరఫరాలో ఎటువంటి అంతరాయం ఉండకూడదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. జిల్లాలో ఎల్‌పీజీ కొరత లేదని, వినియోగదారులు భయంతో సిలిండర్లను నిల్వ చేసుకోవడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం మరియు భవిష్యత్తులో కూడా గ్యాస్ సరఫరా సాధారణంగానే కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.


వినియోగదారుల రక్షణ చట్టంపై అవగాహన అవసరం


వినియోగదారుల రక్షణ చట్టాన్ని జిల్లా వ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు, పౌరులకు ఈ చట్టంపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక మార్కెట్‌లలో విక్రయించే వస్తువుల నాణ్యతను పర్యవేక్షించడం జిల్లా యంత్రాంగం బాధ్యత అని చెప్పారు.


ఆహార పదార్థాల నాణ్యత పర్యవేక్షణలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, సివిల్ సప్లైస్ శాఖ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చిన్న ప్యాకెట్లలో విక్రయించే వస్తువులు, హోటళ్లలో లూజ్‌గా విక్రయించే ఆహార పదార్థాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.


హోటళ్లలో ఆహార నాణ్యతపై తనిఖీలు


ప్యాక్ చేసిన ఆహార పదార్థాలతో పాటు బిర్యానీ, ఇడ్లీ వంటి పదార్థాల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల నాణ్యతను కూడా తనిఖీ చేయాలని ఫుడ్ ఇన్‌స్పెక్టర్లకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఇటువంటి చర్యలు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తే మిగతా వ్యాపారులలో కూడా మార్పు వస్తుందని పేర్కొన్నారు.


కమర్షియల్ సంస్థల్లో డొమెస్టిక్ సిలిండర్ల వినియోగం


ఇటీవల కొన్ని కమర్షియల్ సంస్థల్లో గృహ అవసరాలకు ఉపయోగించే ఎల్‌పీజీ సిలిండర్లను వాడుతున్నట్లు గుర్తించామని తెలిపారు. గత వారం నిర్వహించిన తనిఖీలలో కమర్షియల్ సంస్థల నుంచి సుమారు 300 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇలాంటి తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని తెలిపారు.


ప్లాస్టిక్ నిషేధంపై కఠిన చర్యలు


సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రభుత్వం ఇప్పటికే అనేక ఆదేశాలు జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు అంతగా ప్రభావవంతంగా లేదని అన్నారు. మున్సిపల్ కమిషనర్లు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టాలని ఆదేశించారు.


తాగునీటి నాణ్యతపై పర్యవేక్షణ


మున్సిపాలిటీలు, పంచాయతీలు ప్రజలకు సరఫరా చేసే నీటిలో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ముఖ్యంగా వేసవి, వర్షాకాలాల్లో నీరు కలుషితమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉండటంతో తరచుగా తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. ఆర్‌డబ్ల్యూఎస్ విభాగం ప్రభుత్వ రెసిడెన్షియల్ హాస్టళ్లలో నీటి సరఫరా వ్యవస్థలను తనిఖీ చేయాలని ఆదేశించారు.


తూనికలు, పెట్రోల్ నాణ్యతపై తనిఖీలు


మెట్రాలజీ శాఖ అధికారులు పెట్రోలియం ఉత్పత్తుల నాణ్యతను నిరంతరం తనిఖీ చేయాలని సూచించారు. కిరాణా దుకాణాల్లో ఉపయోగించే తూనికలను మున్సిపల్ అధికారులతో కలిసి తనిఖీ చేయాలని చెప్పారు. వ్యాపారులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. రైతు బజార్లు, మార్కెట్ యార్డులు వంటి రద్దీ ప్రాంతాల్లో వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా తరచుగా తనిఖీలు చేపట్టాలని సూచించారు.


ఈ సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈ మనోహర్, ఆర్టీవో భరత్ చవాన్, డీఎస్‌వో రఘువీర్, ఏపీఎస్‌ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీనివాసులు, ఏపీఎస్పీడీసీఎల్ డిప్యూటీ ఈఈ భాస్కర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాముడు, కర్నూలు మున్సిపాలిటీ డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, జిల్లా కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply