ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం

ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ప్రజలకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలం చెందుతున్నాయని సిపిఎం పార్టీ కేంద్రకం సభ్యులు ఎస్ వీరయ్య ఆరోపించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో కందాల రంగారెడ్డి స్మారక భవనంలో సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రాంతీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వీరయ్య మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్న ప్రజా సమస్యలు ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందన్నారు.
పారిశుద్ధ్యలోపం, తాగునీటి సమస్యపై ప్రత్యేక చొరవ చూపి ప్రజాపార్కులను ఏర్పాటు చేయాలని, అధిక వర్షాలు సంభవించినప్పుడు వరదల కారణంగా కాలనీలోకి నీరు వస్తుందని, డ్రైనేజీ పకడ్బందీగా ఏర్పాటు చేయాలని అన్నారు. చౌటుప్పల్ లో ఫ్లైఓవర్ రోడ్డును, వంద పడకల ఆసుపత్రిని త్వరగా ప్రారంభించాలని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, పూర్తిస్థాయిలో అంతర్గత రోడ్ల నిర్మాణం చేసి కోతులు, కుక్కలు, పందులు, దోమల, బెడద నుండి ప్రజలను కాపాడాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలపై నిరసన, కేంద్ర ప్రభుత్వం ధరలను పెంచి సామాన్యులపై పెనుబారాలు మోపుతుందని, దేశంలోని సామాన్య ప్రజలు బ్రతికే పరిస్థితి లేదని అన్నారు.
సిపిఎం ప్రజా పోరాటాలకు ప్రజలు బాసటగా నిలవాలన్నారు. ఇంటింటి సిపిఎం ప్రజా సమస్యల అధ్యయనం, ఏప్రిల్ నెలలో స్థానిక సమస్యలపై గ్రామీణ పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు. జిల్లాలో మూసి ప్రక్షాళన చేసి గోదావరి జలాల వినియోగంపై డి పిఆర్ ప్రకటించి నిధులు విడుదల చేయాలన్నారు. పిల్లాయిపల్లి కాలువ, ధర్మారెడ్డిపల్లి కాల్వ, భూనాదిగాని కాల్వ, భీమలింగం కాల్వ, ఆసిఫ్ నగర్ కాల్వల పరిధిలో ఎస్టీపీలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, నాయకులు మాటూరు బాలరాజు, బూరుగు కృష్ణారెడ్డి, శ్రీనివాసాచారి, జిల్లెల్ల పెంటయ్య, ఎండి పాషా, గంగాదేవి సైదులు, గోశిక కరుణాకర్, రాగిరి కిష్టయ్య, దోనూరి నర్సిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్, సిర్పంగి స్వామి, శివ, బండారు నరసింహ, బత్తుల దాసు, చిర్క సంజీవరెడ్డి, తడక మోహన్ పాల్గొన్నారు.
