గ్యాస్ సిలిండర్ల కోసం స్థానికుల తిప్పలు

గ్యాస్ సిలిండర్ల కోసం స్థానికుల తిప్పలు

తగ్గిన వంట గ్యాస్ సిలిండర్ల సరఫరా
కొరతతో స్థానికుల ఇబ్బందులు

తొర్రూరు,ఆంధ్రప్రభ : పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణంతో దేశీయంగా వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాపై దుష్ప్రభావం పడింది. దీంతో తొర్రూరులో వంట గ్యాస్ సిలిండర్ల సరఫరా ఇప్పటికే తగ్గుముఖం పట్టింది. యుద్ధంతో సిలిండర్ల కొరత ఏర్పడటంతో గృహ వినియోగదారులు, హోటల్ పరిశ్రమలో ఆందోళనకు కారణమైంది. సాధారణంగా ప్రతి రోజూ రెండు నుంచి మూడు లోడ్ల గ్యాస్ సిలిండర్లు పట్టణానికి వస్తాయి. కానీ గురువారం ఒక లోడ్ మాత్రమే రావడం గమనార్హం.

ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ల సరఫరా పూర్తిగా నిలిపి వేయడం హోటల్, వ్యాపార రంగానికి ఇబ్బందులను కలిగించింది. దీనిపై నగరంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా సరఫరా సమస్య నెలకొందన్నారు. ప్రస్తుతం గృహ వినియోగ సిలిండర్లు మాత్రమే సరఫరా అవుతున్నాయన్నారు. 360 సిలిండర్లు మాత్రమే రాగా డిమాండ్ కు అనుగుణంగా పంపిణీ చేశామన్నారు. ఈ కారణంగా సరఫరాపై ఒత్తిడి పెరిగిందని అన్నారు. రాబోయే రోజుల్లో సిలిండర్ల కొరత ఏర్పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

బుకింగ్, సరఫరాలపై ఆంక్షలు…

ఇప్పటి వరకు బుకింగ్ వ్యవధి 15 రోజులుగా ఉండేది. ఇక నుంచి రెండు సిలిండర్లు కలిగిన వినియోగదారులకు బుకింగ్ వ్యవధిని 30 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఒక సిలిండర్ కలిగిన వారిని 21 రోజుల తర్వాతే బుక్ చేసుకోవాలని షరతు విధించారు. వీటన్నింటి నేపథ్యంలో వంట గ్యాస్ వినియోగంలో పొదుపు పాటించడమే ఉత్తమమన్న విషయాన్ని వినియోగదారులు గుర్తిస్తే కొంతైన ఇబ్బందులు తప్పే అవకాశం ఉంది.

Leave a Reply