Delhi | కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్!
Delhi | కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్!
Delhi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సుప్రీంకోర్టు ఇవాళ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. 13 ఏళ్లుగా జీవచ్ఛవంలా ఉన్న హరీష్ రాణా కారుణ్య మరణానికి (పాసివ్ యూతనేషియా) అనుమతించింది. మానవీయ కోణంలో ఆలోచించిన ధర్మాసనం, అతడికి కారుణ్య మరణం (Euthanasia) పొందేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు ఇవాళ తీర్పునిస్తూ.. హరీశ్‌కు అందుతున్న ప్రాణాధార వైద్య చికిత్సను నిలిపివేయొచ్చని పేర్కొంది.
ఢిల్లీకి చెందిన హరీశ్ రాణా 2013లో చండీగఢ్‌లో ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో ప్రమాదానికి గురయ్యాడు. యూనివర్సిటీ హాస్టల్ నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడటంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి హరీశ్ కోమాలోకి వెళ్లిపోయాడు. శరీరం పూర్తిగా చచ్చుబడిపోయింది. ఇన్నేళ్లుగా తమ కుమారుడిని కళ్లముందే జీవచ్ఛవంలా చూస్తూ ఆ తల్లిదండ్రులు మానసికంగా, ఆర్థికంగా చితికిపోయారు. అతడికి ఈ నరకం నుంచి విముక్తి ప్రసాదించాలని కోర్టులను వేడుకున్నారు. గతంలో ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులు వీరి పిటిషన్‌ను తిరస్కరించాయి.

అయితే, హరీశ్ కోలుకునే అవకాశం ఏమాత్రం లేదని వైద్యులు తాజాగా నివేదిక ఇవ్వడంతో సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని మార్చుకుంది. జనవరి 13న హరీశ్ తల్లిదండ్రులతో స్వయంగా మాట్లాడిన న్యాయమూర్తులు వారి ఆవేదనను అర్థం చేసుకున్నారు. మా బిడ్డకు మర్యాదపూర్వక చావును ప్రసాదించండని వారు కోరిన విన్నపాన్ని మన్నిస్తూ.. చికిత్స ఉపసంహరణకు కోర్టు అంగీకరించింది. తాజాగా, అత్యున్నత న్యాయ స్థానం పాసివ్ యూతనేషియాకి అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
